
‘కేసీఆర్‌కు ఛాన్స్ ఇస్తే ముంచే రోజులే గతి’
బీఆర్ఎస్‌కు కేటీఆర్‌యే మైనస్ అంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
మంచిరోజులు వస్తాయని కేసీఆర్ కలలు కంటున్నారని, అదెప్పటికీ జరగదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెద్ది వ్యాఖ్యానించారు. అయినా మరోసారి కేసీఆర్‌కు ఛాన్స్ ఇస్తే రాష్ట్రానికి వచ్చేది మంచి రోజులు కాదని, ముంచే రోజులేనంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి పాలన సాగుతోందని, బీఆర్ఎస్ హయాంలో అంతా సంక్షేభమేనంటూ చురకలంటించారు. శనివారం నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్బంగానే బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు బీఆర్ఎస్‌కు గుదిబండ కేటీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో పేదలకు దొడ్డుబియ్యం
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు, ఆనాటి సీఎంకు ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాలన్న బుద్ధి కూడా లేదంటూ విమర్శలు గుప్పించారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక యుద్ధప్రాతిపదికన పేదలకు రేషన్ కార్డులు అందించామని అన్నారు. అంతేకాకుండా 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ను కూడా అందించామన్నారు. వాళ్ల హయాంలో దొడ్డు బియ్యం ఇస్తే అవి తినలేక ప్రజలు నానా అవస్థలు పడ్డారని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం అందించి వారి ఆకలి బాధలు తీర్చామన్నారు.
గృహ నిర్మాణంలో బీఆర్ఎస్ చేసిన వాగ్దానాలు వాస్తవంగా మారలేదని విమర్శించారు. “యూపీఏ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాం. ఇప్పుడు మేము మరో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం ఇచ్చాం. డబుల్ బెడ్‌రూం పేరుతో బీఆర్ఎస్ పేదలను మోసం చేసింది. గత పది సంవత్సరాల్లో ఎన్ని ఇళ్లు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి. పేదలకు న్యాయం జరిగే పాలన కాంగ్రెస్‌దే” అని అన్నారు. అదే విధంగా రైతన్నలకు కూడా తమ ప్రభుత్వం అండగా నిలిచిందని, వారికి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామని చెప్పారు.
భవిష్యత్‌లోనూ రైతులకు ప్రాధాన్యత
“ప్రతి రైతుకు రెండు లక్షల చొప్పున మొత్తం రూ.21 వేల కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశాం. రుణమాఫీ పేరుతో కేసీఆర్ పదేళ్ల పాటు రైతులను మోసగించాడు” అని రేవంత్ విమర్శించారు. రైతుల సంక్షేమం కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణలో కూడా ప్రాధాన్యత పొందుతుందని స్పష్టం చేశారు. నల్గొండ ప్రజలకు అత్యంత ప్రాధాన్యమైన ఎస్‌ఎల్‌బీసీని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్‌ఎల్‌బీసీని కేసీఆర్ పదేళ్లపాటు పట్టించుకోలేదు. పనులు ప్రారంభం కావడంతో జరిగిన ప్రమాదంపై కొందరు బీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేసిన స్థితి బాధాకరం. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తాం. నల్గొండకు నీరు తీసుకురావడం ఈ ప్రభుత్వపు సంకల్పం. మామ, అల్లుడు ఆగిపోయిన పనిపై సంబరపడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టును పదేళ్లపాటు వదిలేశారు” అని తీవ్రంగా విమర్శించారు.
కేటీఆర్ ఉన్నంత కాలం ఇదే పరిస్థితి
“పది సంవత్సరాల దోపిడీ తర్వాత ‘మంచిరోజులు వస్తాయి’ అని చెప్పడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలను ముంచే రోజులు వస్తాయి. కేటీఆర్ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ప్రజాదరణ పొందదు” అని అన్నారు. కేసీఆర్ గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కలిసి మాట్లాడలేని పరిస్థితి సృష్టించారని, ప్రజలతో దూరం పెంచుకున్నారని అన్నారు. “ఇప్పుడు తిరిగి సర్పంచులు, వార్డు సభ్యులను కలవడం ఓటమి ప్రభావం మాత్రమే” అని వ్యాఖ్యానించారు.
“60 వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చాం. త్వరలో మరో 40 వేల ఖాళీలు భర్తీ చేస్తాం. యువతకు అవకాసాలు కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. అది కొనసాగుతుంది” అని తెలిపారు. ప్రజా పాలన, పారదర్శకత, పేదల సంక్షేమం, రైతుల ఆర్థిక భద్రత కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని, నల్గొండ, దేవరకొండ అభివృద్ధి పథంలో ముందుకు జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

