హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ
x

హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ

వచ్చే మూడేళ్ళలో హైదరాబాద్ ను ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్) గ్లోబల్ హబ్ గా మారుస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.


వచ్చే మూడేళ్ళలో హైదరాబాద్ ను ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్) గ్లోబల్ హబ్ గా మారుస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల డిక్లరేషన్ లో చెప్పినట్టు ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. హైదరాబాద్ HICC లో జరిగిన AI గ్లోబల్ సమ్మిట్ 2024 లో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రేవంత్ నూతన ఏఐ సిటీ లోగోని లాంచ్ చేశారు. ఏఐ రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించారు. రాబోయే రెండుమూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్హికి చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... ఏఐ నేటితరం అద్భుత ఆవిష్కరణ అని కొనియాడారు. కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయన్నారు. అలాగే అవి ఆశలతో పాటు భయాన్ని తీసుకొస్తాయని వివరించారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సిద్ధంగా లేదన్నారు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామన్నారు. నాస్కామ్ సహకారంతో ఫ్రేమ్ వర్క్ రూపకల్పన జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో కలసి పనిచేస్తుందన్నారు. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దామని పిలుపునిచ్చారు.

ఏఐకి మొదటి ప్రాధాన్యత...

రైలు ఇంజన్, టీవీ, కెమెరాతో ప్రారంభమైన ఆవిష్కరణలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చాయని రేవంత్ తెలిపారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతూ వస్తోందన్నారు. ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏఐ రంగంలో పరిజ్ఞానం ఉన్న వారికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

200 ఎకరాల్లో AI సిటీ...

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ... తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ముందంజలో ఉందని స్పష్టం చేశారు. “తెలంగాణ ఈ విప్లవంలో కేవలం పాల్గొనడం మాత్రమే కాదు, దానిని నడిపిస్తోంది,” అని అన్నారు. రాష్ట్రం సంవత్సరానికి 11.3% ఆర్థిక వృద్ధిని సాధించడంతో, మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) 176 బిలియన్ డాలర్లుగా చేరింది. త్వరలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నట్టు చెప్పారు.

తెలంగాణ AI వ్యూహానికి కేంద్రబిందువు హైదరాబాదు సమీపంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడిన AI సిటీ. ఇది AI పరిశోధన, అభివృద్ధికి అంకితం చేయబడిన హబ్‌గా రూపొందుతుంది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణను గ్లోబల్ AI చుక్కానిగా నిలబెట్టడానికి, అత్యాధునిక కంప్యూట్ ఫెసిలిటీస్, విస్తృత డేటా సెంటర్లు, సుస్థిర కనెక్టివిటీని అందిస్తోంది. "ఈ AI సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లు అవుతుంది, మా టెక్నాలజీ శక్తిసామర్థ్యాన్ని దృఢంగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. AI సిటీలో ఒక స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ప్రారంభించడానికి కూడా మేం ప్రణాళికలు సిద్ధం చేశాం," అని మంత్రి ప్రకటించారు.

ఏఐ సిటీ నిర్మాణం పూర్తయ్యేంత వరకు శంషాబాద్ తెలంగాణ ప్రపంచ వాణిజ్య కేంద్రం 2 లక్షల చదరపు అడుగుల అన్ని సౌకర్యాలతో కూడిన కార్యాలయ స్థలాన్ని AI ఆధారిత కంపెనీల కోసం అందిస్తుంది, తద్వారా AI సిటీ రూపకల్పన జరుగుతున్నప్పుడు వారు కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది.

‘AI ఆధారిత తెలంగాణ’ కింద పేర్కొన్న లక్ష్యాలను సాధించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థలు, విద్యాసంస్థలు, దిగ్గజ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలతో 26 అవగాహన పత్రాలు (MoUs) కుదుర్చుకుంది. ఈ అవగాహన పత్రాలు తెలంగాణను దేశంలో AI పరంగా బలమైన శక్తిగా మార్చడానికి ఉపకరిస్తాయి. ఈ అవగాహన పత్రాలను ప్రధానంగా 7 విభాగాల్లో కుదుర్చుకున్నాం: కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్‌లెన్స్ కేంద్రం, స్కిల్లింగ్, ఇంపాక్ట్ అసెస్‌మెంట్, స్టార్టప్ ఇన్నొవేషన్, జనరేటివ్ AI, పరిశోధన సహకారం, డేటా అనోటేషన్.

AI అభివృద్ధిని సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ AI పాలన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించిందని చెప్పారు. AI తప్పుదోవ పట్టించే సందర్భాలు, డీప్ ఫేక్స్, మరియు AI ఆధారిత తప్పుడు సమాచారాన్ని నిరోధించడానికి నియంత్రణలను కలిగి ఉండే విధంగా ఈ పద్ధతిని రూపొందిస్తామని వెల్లడించారు. ఈ అంశాలన్నింటిని సమన్వయం చేసి, AI ద్వారా తెలంగాణను ప్రపంచ మేధోశక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళికలు పటిష్టంగా రూపొందిస్తున్నట్టు తెలిపారు.

Read More
Next Story