
‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ప్రారంభం
గిరిజన రైతుల కోసం ప్రభుత్వం తెచ్చిన ఈ పథక లక్ష్యం ఏంటి?
రైతుల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో పథకం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా మున్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ఈ పథక ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. సీఎం కూడా దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద ఉన్న 6.69 లక్షల విస్తీర్ణ భూమిని దాదాపు 2.30 లక్షల మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రైతులు సాగుచేస్తున్నారు. వారందనికి తాజాగా ప్రభుత్వం పోడుపట్టాలు అందించింది. ఆ భూముల్లోని విద్యుత్ సౌకర్యం కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 6 లక్షల ఎకరాలకు విద్యుత్ వెలుగు అందించనున్నారు. గిరిజన రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్, అంతకన్నా తక్కువ భూమి ఉంటే అటువంటి ఇతర రైతులను కలిపి బోర్‌వెల్ యూజర్ గ్రూప్‌గా ఏర్పాటు చేస్తారు. ఇది సాధ్యం కాకుంటే ఓపెన్‌వెల్ గ్రూప్ ఏర్పాటు చేస్తారు. జిల్లాస్థాయిలో పథకం అమలు, కొనుగోళ్ల కమిటీకి కలెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు.
మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను ఈ నెల 25 వరకు గుర్తించనున్నారు. జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన, భూగర్భ జలాల సర్వే సహా ఇతర పనుల్ని గిరిజన సంక్షేమ శాఖ చేపడుతుంది. జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నారు అధికారులు. తొలి ఏడాదికి పదివేల మంది రైతులకు చెందిన 27,184 ఎకాలకు సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధిక విస్తీర్ణంలో పోడు భూములున్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, ములుగు, నిర్మల్, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌లను ప్రత్యేక జిల్లాలుగా గుర్తించారు. తక్కువ విస్తీర్ణంలో భూములున్న జిల్లాలను సమీపంలోని ఇతర జిల్లాలతో కలిపి 5 నోడల్ జిల్లాలుగా ప్రకటించారు.
ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.12,600 కోట్ల నిధులను కేటాయించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అంతేకాకుండా పోడుభూములను సాగులోకి తీసుకురావడం కోసం ఇంత మొత్తంలో నిధులు కేటాయించిన ప్రభుత్వం మరేదీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భూముల్లో అవకాడో, వెదురు, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, అంజీర్ వంటి లాభదాయకమైన పంటల సాగు, ప్రకృతి వ్యవసాయంపై గిరిజనులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.
Inaugurates