
National Herald : కేసులకు భయపడేది లేదన్న సీఎం రేవంత్
నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి మంచి చేయాలనే ఆనాడు తమ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం అందించారన్న సీఎం రేవంత్.
కేసులతో కాంగ్రెస్ నాయకులను భయపెట్టలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తమ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెట్టారని, వాటిని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో రేవంత్ పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే సోనియా, రాహుల్ గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేకనే నేషనల్ హెరాల్డ్ కేసుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు. అందుకే మూతబడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి మంచి చేయాలనే ఆనాడు తమ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం అందించారని అన్నారు రేవంత్ రెడ్డి. మూతబడిన పత్రికను పునరుద్దరించాలనే కాంగ్రెస్ పార్టీ భావించిందని వివరించారు.
‘‘కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక పత్రిక ఉండాలని భావించారు. అందుకోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను పునరుద్దరించే ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా కొందరు కాంగ్రెస్ నేతలను తీసుకున్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ప్రపంచస్థాయికి ఉస్మానియా యూనివర్సిటీ
తెలంగాణలోని ఉస్మానియా యూనిర్సిటీని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకోసం ఎంత ఖర్చు అయినా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 7న విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నట్లు చెప్పారు. ఆ పర్యటనలో యూనివర్సిటీ అభివృద్ధికి కావాల్సిన నిధులు, చేపట్టాల్సిన పనులపై చర్చించనున్నట్లు తెలిపారు.
వన్ ట్రిలియన్ ఎకానమీ వైపు తెలంగాణ
గత పాలకుల ప్రభుత్వంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని రేవింత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణకు ఒక్కటంటే ఒక్క విమానాశ్రయం కూడా రాలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నాలుగు ఎయిర్‌పోర్ట్‌లను తీసుకొచ్చామని చెప్పారు. సంక్షోభంలో ఉన్న తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వన్ ట్రిలియన్ మార్క్‌కు చేర్చడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని వివరించారు. అందరి కృషితో దీనిని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

