
ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ..
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలంటూ ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్.
తెలంగాణ ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి.. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. డిసెంబర్ 8, 9తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానాలు అందిస్తున్నారు. ఈ సమ్మిట్‌కు రావాలని ప్రధానిని కూడా కోరారు.
అనంతరం పలు అంశాలపై మోదీతో చర్చించారు. హైదరాబాద్-బెంగళూరు-చెన్నై బుల్లెట్ ట్రైన్ కావాలని కూడా రేవంత్ కోరారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. కాగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా ఈ సమ్మిట్‌కు ఆహ్వానించారు.
ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎం ప్రధానికి అందించారు. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా .. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని సీఎం ప్రధానికి వివరించారు.
దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు.
నీతి అయోగ్ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ ను గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నట్లు సీఎం ప్రధానికి వివరించారు.
ఈ క్రమంలోనే మంగళవారం కొత్తగూడెంలో బహిరంగ సభ ముగించుకుని వెంటనే బేగంపేట విమానాశ్రయం నుంచి రేవంత్ ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ మంగళవారమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించారు.

