Revanth Reddy | ఆరోగ్య ఉత్సవాల్లో పచ్చజెండా ఊపిన సీఎం రేవంత్ రెడ్డి..
x

Revanth Reddy | ఆరోగ్య ఉత్సవాల్లో పచ్చజెండా ఊపిన సీఎం రేవంత్ రెడ్డి..

ప్రజా విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.


ప్రజా విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఈరోజు ఆరోగ్య ఉత్సవాలను చేపట్టింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగానే 108, 102 వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు సీఎం. 108 సేవల కోసం 136 అంబులెన్స్‌లు, 102 సేవల కోసం 77 అంబులెన్స్‌లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పలు కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాక మంత్రిగా దామోదర రాజనర్సింహ పనితీరును సీఎం మెచ్చుకున్నారు. ఆయన ఎదురవుతున్న సవాళ్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని, ప్రజల సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిస్కరిస్తూ ముందుకెళ్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వైద్య ఆరోగ్య శాఖలో 14వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ఈ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

చరిత్రలో ఎక్కడా లేదు

‘‘ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో 14 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 7750 మంది పారామెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశాం. ఉద్యోగ,ఉపాధి కోసం తెలంగాణ ఉద్యమం లో యువత రోడ్లపైకి వచ్చి పోరాడారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా,పరీక్షలు పెట్టకుండా ప్రశ్నా పత్రాలను అమ్ముకుంది. కేసీఆర్ ఇంట్లో వాళ్లను ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేస్తే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒకే యేడాది 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. దేశంలో తెలంగాణ గొప్ప చరిత్ర సృష్టించింది’’ అని పేర్కొన్నారు.

ఎన్ని అడ్డంకులొచ్చినా వెనక్కి తగ్గలేదు

‘‘డీఎస్సీ వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత కృత్రిమ ఆందోళన చేశారు. ఎవరు అడ్డుపడినా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించాం. తెలంగాణ యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి కి ఇది నిదర్శనం. గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని కోర్ట లకు వెళ్లినా న్యాయస్థానాలు సమర్థించలేదు. పరీక్ష వాయిదా కోసం కొందరు కృత్రిమ ఉద్యమాలు చేశారు. 2011 తర్వాత గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు. 13 ఏళ్ల తర్వాత గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి ప్రశ్నా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు’’ అని విమర్శించారు.

చాకచక్యంగా గ్రూప్-1 పరీక్ష

‘‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 563 మంది గ్రూప్ 1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు కు ఇది గీటు రాయి. మూడున్నర ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికి బుర్రా వెంకటేశం ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా నియమించాం. గత ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మార్చింది. ఆర్ ఎంపీ డాక్టర్లు, డిప్యూటీ ఎమ్మార్వోలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించారు. ఉన్నత చదువులు చదువుకున్న వారిని మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించింది’’ అని తెలిపారు.

పదేళ్ల వీసీలు లేరు

‘‘10 ఏళ్ల పాటు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లను నియమించలేదు. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది.

ఏడాది కాలంలో 835 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ని ప్రజలకు ఇచ్చాం ఇదొక రికార్డు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు కోటి 15 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. 50 లక్షల కుటంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం. మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేశాం’’ అని వెల్లడించారు.

రైతు భరోసా అప్పుడే

‘‘సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. రుణ మాఫీ, రైతు భరోసాతో కొంత మంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. గత పాలకులు వరి వేసుకుంటే ఉరేనని అన్నారు. మా ప్రభుత్వం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తోంది. తెలంగాణ రైతులు 63 లక్షల ఎకరాల్లో కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు ఇస్తున్న బోనస్ తో కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే పదేళ్లు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.. బోనస్ కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దుల్లా కొందరు స్థానిక సంస్థల ఎన్నికల కోసం వస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు.

వాళ్లకి వాత పెట్టాలి..

‘‘పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, 15 యేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే. ప్రభుత్వం పైన జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి. 10 యేళ్ళ పాటు అధికారంలో ఉండి జయ జయహే పాటను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం కాదా..? తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టే ఆలోచన కూడా గత పాలకులకు రాలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గత పాలకులు నెరవేర్చలేదు. తెలంగాణ ప్రభుత్వ ఏడాది విజయోత్సవాలకు ప్రజలు తరలిరావాలి’’ అని పిలుపునిచ్చారు.

Read More
Next Story