
ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్ తెస్తా
ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌కు ఆకాశమార్గాన్ని తెస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి.
ఎర్రబస్సు కూడా రావడం కష్టం అనుకునే ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్‌ను తీసుకొస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత పాలకుల మాదిరి తాము స్వలాభాలు చూసుకోమని, ప్రజాలాభాలకే పెద్దపీట వేస్తామని అన్నారు. ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనులను రేవంత్ గురువారం ప్రారంభించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి ఒక్క విమానాశ్రయం కూడా రాలేదని, కానీ మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నాలుగు ఎయిర్‌పోర్ట్‌లు తెచ్చామన్నారు. అతి త్వరలోనే బుల్లెట్ ట్రైన్‌ను కూడా తీసుకువస్తామని చెప్పారు. ఇదే విషయంపై ప్రధాని మోదీతో కూడా చర్చించినట్లు వెల్లించారు.
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్‌లో జరిగిన కార్యక్రమాల్లో భాగంగా రూ.18.7 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘రెండేళ్ల క్రితం ప్రజలు ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ పాలనను ముగించారు. వారి ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్లుగా పనిచేస్తున్నాయి. రెండు సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా సేవ చేస్తున్నా. చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యత దక్కడం ప్రజల ప్రేమ, దేవుడి అనుగ్రహమే’’ అని రేవంత్ అన్నారు.
‘‘విపక్ష ఎమ్మెల్యేలను పదేళ్ల పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం పెట్టారు గత పాలకులు. సచివాలయంలోకే రావడానికి అడ్డుపడ్డ పరిస్థితులను ప్రజలు చూశారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన ఆశయాలు గత ప్రభుత్వంలో నెరవేరలేదు’’ అని రేవంత్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం "తెలంగాణ రైజింగ్–2047" రూపకల్పన చేసి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంద్రవెల్లి ఆత్మస్ఫూర్తితో పోరాటాలు ప్రారంభించానని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంద్రవెల్లి అమరుల స్థూప అభివృద్ధి ఫైల్‌పై సంతకం చేశానని తెలిపారు.
నీటి ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావించిన ఆయన, ‘‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుతో ఆదిలాబాద్‌కు సాగునీరు చేరేలా వైఎస్‌ఆర్ ప్రారంభించిన పనులను కేసీఆర్ ప్రభుత్వం పక్కకు పెట్టింది. బదులుగా లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మించారు. అయితే కేవలం మూడు సంవత్సరాల్లోనే ఆ ప్రాజెక్టు కూలిపోయింది. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టును నాశనం చేసి, అక్రమ సంపాదన కోసం పనిచేసిన కుటుంబంలో ఇప్పుడు గొడవలు తలెత్తుతున్నాయి. అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్లను తుమ్మిడిహెట్టిలోనే పూర్తి చేసి ఆదిలాబాద్‌కు నీరు అందిస్తాం’’ అని భరోసా ఇచ్చారు. తదుపరి నెలల్లో మరో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు.

