
సంక్షేమంపై సీఎం ఫోకస్.. కంట్రోల్ సెంటర్‌లో డిస్కషన్..
హాస్టళ్లలో వసతులపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్.
తెలంగాణ ప్రజలకు అందిస్తున్న సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లలో కల్పిస్తున్న వసతులపై ఆరా తీవారు. సోమవారం కంట్రోల్ సెంటర్‌లో సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక అంశాలను చర్చించారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై చర్చించారు. హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయి డేటాను సేకరించాలని సూచించారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
‘‘పూర్తిస్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలి. హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలి. విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్ కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలి. హాస్టళ్లలో విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు వారికి చేరుతున్నాయో లేదో ధ్రువీకరించాలి. మౌలిక వసతులకు సంబంధించి ప్రతీ హాస్టల్ లో పరిస్థితులపై పూర్తిస్థాయి డేటాను అప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలి’’ అని చెప్పారు.
‘‘ఇందుకు అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలి. ఇందుకు సంబంధించి ఏరియలవారీగా హాస్టళ్లను సమీపంలో ఉన్న మెడికల్ కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ తో లింక్ చేయాలి. తరచూ హాస్టళ్లను సందర్శించి హెల్త్ చెకప్స్ చేసేలా చూడాలి. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి.. ప్రతీ నెలా గ్రీన్ ఛానల్ లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలి’’ అని అధికారులను ఆదేశించారు.
అయితే కొంతకాలంగా సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు అధికంగా జరుగుతున్నాయి. పలువురు విద్యార్థులు మరణించిన ఘటనలు కూడా తలెత్తాయి. వీటిపై సీఎం రేవంత్ పలుసార్లు కీలక ఆదేశాలు జారీ చేశారు. అయినా పెద్దగా ఫలితం కనిపించకపోవడంతోనే సంక్షేమ సంఘాల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని, వారి సమస్యలు ఏంటో తెలుసుకోవాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కమాండ్ కంట్రోల్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గర పడుతున్న క్రమంలో రేవంత్ ఈ సమీక్ష నిర్వహించడం అనేక చర్చలకు దారితీస్తోంది. ఆయన విద్యార్థులు, ప్రజలపై ప్రేమతో ఈ సమీక్ష నిర్వహించారా? రానున్న ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సమీక్ష చేశారా? అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. విశ్లేషకుల నుంచి ఈ అనుమానాలే వినిపిస్తున్నాయి. అనేక ఘటనలు జరిగినప్పుడు, సంక్షేమం పడకేసినప్పుడు పెట్టని సమీక్ష.. ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన రోజే ఎలా పెట్టారు? అని కూడా కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.