కలిసొచ్చే కాలానికే పంచాయతీలపై కాంగ్రెస్ కన్ను
x

కలిసొచ్చే కాలానికే పంచాయతీలపై కాంగ్రెస్ కన్ను

సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.


సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు, కార్యాచరణ పై చర్చలు జరిపారు. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని సీఎం బీసీ కమిషన్ ని కోరారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఈ సమీక్షా సమావేశానికి హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణ మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.

కలిసిరానున్న రుణమాఫీ?

తెలంగాణలో బలంగా పాతుకుపోవాలని ఆశపడుతోన్న కాంగ్రెస్ పార్టీ కలిసొచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. అందులో భాగంగా రుణమాఫీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతోపాటు పంచాయతీ ఎన్నికలకి మంచి అవకాశంగా మలచుకునే ఛాన్స్ ఉంది. మూడు విడతల్లో పంద్రాగస్టు లోపల అర్హులందరికీ.. రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పంచాయతీ ఎన్నికలు గనుక జరిగితే కాంగ్రెస్ కి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. రుణమాఫీ పొందిన మెజారిటీ కుటుంబాలు కృతజ్ఞతగా కాంగ్రెస్ కే ఓట్లు కురిపించకమానరు. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కడతారు. దీంతో క్షేత్ర స్థాయిలోనూ కాంగ్రెస్ తిరిగి జెండా పాతేందుకు అవకాశం దొరుకుతుంది. అందుకే రుణమాఫీకి, పంచాయతీ ఎన్నికలకి ఎక్కువ గ్యాప్ లేకుండా కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Read More
Next Story