
KTR | ‘రంగరాజన్‌పై దాడి.. సీఎం సమాధానం చెప్పాలి’
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరగడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరగడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మ రక్షకులు దాడులు చేస్తే రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుకుంటారంటూ విమర్శలు చేశారు కేటీఆర్. ఈ మేరకు కేటీఆర్.. ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘రంగరాజన్‌పై దాడి ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనికి సంబంధించిన వీడియోలున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే సోమవారం చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కేటీఆర్ సందర్శించారు. ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గం. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యింది.. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా ఉపేక్షించకూడదు. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ గారి కుటుంబ పరిస్థితే ఈ విధంగా ఉందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా, కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.
అయితే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి జరిగింది. ఆయన ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడి పాల్పడ్డారు. దీంతో రంగరాజన్.. స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తనపై దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని రంగరాజన్ వెల్లడించారు. ‘‘నాపై 20 మంది దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మిగతా వివరాలు విచారణలో తెలుస్తాయి. ఇంతకు మించి నాపై జరిగిన దాడి గురించి మాట్లాడను’’ అని రంగరాజ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకరిని అరెస్ట్ చేసినట్లు కూడా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వివరించారు.
ఏపీ అర్చక సమాఖ్య ఆగ్రహం
రంగరాజన్‌పై దాడిని ఏపీ అర్చక సమాఖ్య తీవ్రంగా ఖండించింది. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆలయాల్లో పూజలు చేసే అర్చకులపై దాడి చేయడమేంటని ఏపీ అర్చక సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసుల స్వామి కోరారు.