
‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను పెంచాలని ఆదేశించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. రాత్రి 1:45 గంటల ప్రాంతంలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. భారత్ చేపట్టిన ఈ సర్జికల్ స్ట్రైక్స్‌తో దేశమంతా అప్రమత్తమైంది. పాక్ నుంచి ఎటువంటి దాడులు జరిగినా ఎదుర్కునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావు లేదన్నారు. దేశ సైన్యంతో మనమంతా కలిసి ఉన్నామనే సందేశం ఇవ్వాలని వ్యాఖ్యానించారు.
‘‘అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు. ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలి. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలి. శాంతి భద్రతల కు భంగం కలుగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలి’’ అని అన్నారు.
‘‘బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలి. అత్యవసర మెడిసిన్ సిద్దం చేసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలి. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలి. సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలి. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. రాజధాని లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ను కమాండ్ కంట్రోల్ రూం కి అనుసంధానం చేయాలి’’ అని ఆదేశించారు.
‘‘అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలి. హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను పెంచాలి. ఐటీ సంస్థల దగ్గర భధ్రతను పెంచాలి. హైదరాబాద్ నగరం లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలి. హిస్టరీ షీటర్ లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలి’’ అని సూచించారు.