ఆదివాసీలకు అన్నీ అందిస్తాం.. సీఎం రేవంత్ భరోసా
x

ఆదివాసీలకు అన్నీ అందిస్తాం.. సీఎం రేవంత్ భరోసా

తెలంగాణలో ఆదివాసీ ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


తెలంగాణలో ఆదివాసీ ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, ఉద్యోగం, ఆర్థిక అభివృద్ధి అన్నీ కూడా ఆదివాసీల చెంతకు చేరేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు అంశాలపై భరోసా కల్పించారు. వారికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని, ఆదివాసీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు రేవంత్. ఈ సమావేశం సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను ఆదివాసీ సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వారి పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందించారు. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపడతామన్నారు.

ఆదివాసీల విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు కోరాయి. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్డు రవాణా, సాగు, తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు ఆదివాసీ నేతలు. ఐటీడీఏలను బలోపేతం చేయాలని సీఎంను కోరారు. వారి వినతులపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. తాము ఆదివాసీలను ఎన్నడూ మర్చిపోలేదని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సమావేశం ఇంద్రవెల్లోలోనే నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికలకు ముందే ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని చర్చించుకున్నామని, అధికారం వస్తూనే ఆ పనిని యుద్ధ ప్రాతిపదికన చేశామని చెప్పారు.

‘‘రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. కొమురం భీమ్ వర్ధంతి, జయంతులను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశిస్తున్నా. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం. ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించే అంశాన్ని అధ్యయనం చేయండి. విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్‌ను క్లియర్ చేయాలి’’ అని సీఎం అధికారులకు సూచించారు.

‘‘మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోండి. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి రిపోర్టు అందించాలి. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి రిపోర్ట్ అందించాలి. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. జనాభా ప్రాతిపదికన ఇచ్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి. ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలి. స్పెషల్ డ్రైవ్‌గా తీసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read More
Next Story