‘విద్య వ్యవస్థను మార్చేస్తా’.. విద్యార్థులకు సీఎం హామీ
x

‘విద్య వ్యవస్థను మార్చేస్తా’.. విద్యార్థులకు సీఎం హామీ

తెలంగాణ విద్య వ్యవస్థలో తమ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పదేళ్ల పాటు తెలంగాణ విద్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.


తెలంగాణ విద్య వ్యవస్థలో తమ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత పదేళ్ల పాటు తెలంగాణ విద్య వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, విద్యార్థుల కనీస అవసరాలను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎన్ని అవస్థలు పడుతున్నప్పటికీ గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని మండిపడ్డారు.

కానీ తమ ప్రభుత్వం మాత్రం విద్య వ్యవస్థకు పెద్దపీట వేస్తుందని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపడుతోందని అన్నారు. విద్యార్థుల వసతి గృహాల డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులు ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సీఎంను కలిశారు.

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో ఈ ఇష్టాగోష్ఠి జరిగింది. ఇందులో సీఎంకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్య వ్యవస్థ కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న పలు ఇతర నిర్ణయాలను, చర్యలను కూడా సీఎం వారికి వివరించారు. ఈ సందర్భంగానే తమకు సొంత హాస్టల్ భవనం నిర్మించాలని విద్యార్థులు కోరగా.. స్థల సేకరణ చేయించిన అనంతరం భవన నిర్మాణానికి అమోదం తెలుపుతామని, అందుకు కావాల్సిన నిధులను కూడా మంజూరు చేస్తామని సీఎం.. విద్యార్థులకు హామీ ఇచ్చారు.

విద్య వ్యవస్థ కోసం కీలక చర్యలు

విద్యార్థులతో ముఖాముఖీ అయిన సీఎం పలు కీలక విషయాలను వెల్లడించారు. విద్యావ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టడంలో భాగంగా ముందుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ తెలిపారు. దాంతో పాటుగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్ష ఇస్తున్నామని, దీనిని మరింత విస్తృతం చేస్తామని అన్నారు.

ఐటీలను ఏటీసీలుగా మారుస్తామని, త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారాయన. అంతేకాకుండా యువజన సంఘాలు అన్నీ కూడా బడికి దూరమైన, బడి బయట ఉన్న విద్యార్థులను మళ్ళీ బడి బాట పట్టించడంలో చొరవ చూపాలని, పాఠశాలలు, కాలేజీల్లో పెరుగుతున్న డ్రాప్ అవుట్స్ సంఖ్యను తగ్గించాలని కోరారు.

యువతపైనే అతిపెద్ద బాధ్యత

దేశాన్ని అభివృద్ధి చేయడంలో, తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యత అంతా కూడా యువతపైనే ఉందని సీఎం అన్నారు. ఈ అభివృద్ధి ప్రయాణంలో యువతపైనే అతిపెద్ద బాధ్యత ఉందని, యువత జీవితంలో ముందడుగు వేస్తే రాష్ట్రం కూడా ఆటోమేటిక్‌గా అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఏ విద్యార్థి కూడా విద్యను నిర్లక్ష్యం చేయొద్దని, అదే విధంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఇటువంటి అలవాట్లు జీవితాలను బలితీసుకుంటాయని హెచ్చరించారు. విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. రాజకీయ పార్టీలు చేసే రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మొద్దని, అసలు పట్టించుకోవద్దని అన్నారు. విద్యార్థులు చదువు, సామాజిక స్పృహపై దృష్టి పెట్టాలని, ఇవి చాలా ముఖ్యమని వివరించారు.

కాంగ్రెస్ వచ్చాకే కష్టాలు: హరీష్

ఇదిలా ఉంటే మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు కూడా విద్యార్థుల సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. విద్యార్థులకు అది చేశాం, ఇది చేశాం సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఉన్నత పాఠశాలలోని పరిస్థితులే నిదర్శనమని ఎద్దేవా చేశారు హరీష్ రావు. వాంకిడి పాఠశాలలోని పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయని, అయినా ప్రభుత్వం చలనం లేకుండా దిష్టిబొమ్మలా నిల్చుందంటూ చురకలంటించారు హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు హరీష్ రావు.

‘‘ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నది. సోకాల్డ్ ప్రజా పాలనలో అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్తు ఆందోళనకరమవుతున్నది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థత గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గం. స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో విడతల వారీగా విద్యార్థులను చేర్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయడం లేదు. వెంటిలేటర్ మీదకు చేరిన ఆ విద్యార్థిని పరిస్థితికి ఎవరు బాధ్యులు. సకాలంలో వైద్యం అందించడంలో ఎందుకు విఫలం అయ్యారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలిపే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు’’ అని హరీష్ రావు పోస్ట్ పెట్టారు.

Read More
Next Story