ఉద్యోగుల కళ్ళలో సంతోషం చూడాలన్నదే కోరిక: రేవంత్ రెడ్డి
ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వారి సంతోషం కోసమే దసరాకు ముందే అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించనున్నట్లు ప్రకటించారు.
ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వారి సంతోషం కోసమే దసరాకు ముందే అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని, వాళ్లు రోడ్డెక్కి ఆందోళనలు చేసినా, నిరసలు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం అలా కాదని, నిరుద్యోగుల న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటుందని, ఒక్క నిరుద్యోగి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే అందరికీ ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఓట్లు వేసి ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూసుకుంటామని అన్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, ఉద్యోగుల కళ్లల్లో సంతోషం చూడాలన్నదే తన ఆశ అని చెప్పారు. అందుకనే దసరా పండగకు ముందే వారందరినీ నియామక పత్రాలు అందిస్తున్నామని వివరించారు.
1635 మందికి నియామక పత్రాలు
ఈరోజు తమ ప్రభుత్వం 1635 మందికి నియామక పత్రాలు అందించింది. ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లక్షలాది మంది హైదరాబాదీల దాహార్తిని తీర్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజినీర్లను ఆదర్శంగా తీసుకోవాలని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడాలు కోకొళ్లలుగా ఉన్నాయి. వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం ఒకవైపు ఉన్నాయి. టెక్నాలజీ లేని సమయంలోనే పెద్ద ప్రాజెక్టులు కట్టుకున్నాం. మీ కళ్ల ముందే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మన కళ్లముందే కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డీపీఆర్ లేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం కట్టినవారిని ఆదర్శంగా తీసుకుంటారా? ఆలోచించుకోండి. ఉద్యోగంలో చేరిన రోజు నుంచి పదవీ విరమణ అయ్యే వరకు ఒకే విదంగా ఉండండి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా బాధ్యతలను నిర్వర్తించండి’’ అని ఉద్యోగులను కోరారు.
కుటుంబానికే కేసీఆర్ పెద్దపీట
‘‘కేసీఆర్ తన ప్రభుత్వ సమయంలో ఏకాడికి తన కుటుంబీకులకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. 2015లో నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఉద్యోగాలు ఎందుకు ఎవ్వలేదు? తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని.. విద్యార్థి నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ కవచంగా మార్చుకున్నారు. ఇవాళ ఆ ముసుగును తీసేయడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇది మా చిత్తశుద్ది. మా బాధ్యత’’ అని చెప్పుకొచ్చారు రేవంత్.
తెలంగాణ ఉద్యమం ఒక ముసుగే
తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌కు కేవలం ఒక ముసుగు మాత్రమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్ ముసుగు తొలగిపోయింది. మూసీని ప్రక్షాళన చేయొద్దా? మూసీ నిర్వాసితులు బాగుపడకూడదా? మూసీ దుర్గంధంగానే ఉండాలా? అందులోనే అక్కడి వారు బతకాలా? మూసీ పరివాహక ప్రజలకు ఇళ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తును అందిద్దాం. ఎవరు అడ్డు వచ్చినా మూసీ రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం’’ అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘ఒకరోజు మూసీ నదిపై కేటీఆర్, హరీష్‌రావు మాట్లాడతారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ వచ్చి మాట్లాడతారు. ప్రతిదానికి అడ్డుపడటం సరికాదు. మూసీ బాధితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఉంటే ఇవ్వండి. ఆటల అంగి మారింది కానీ, వాసన మారలేదు. మెడపట్టి గెంటేసినా బీఆర్ఎస్ పక్కనే చేరుతున్నారు. ఈటల ఎప్పటికైనా పేదల వైపు నిలబడాలి. ఇలా వచ్చి అలా వెళ్లడం కాదు’’ అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.