
‘వరద నష్టానికి శాశ్వత పరిష్కారం చూపాలి’
కామారెడ్డి పర్యటనలో అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.
వరద నష్టానికి శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భవిష్యత్తులో ప్రజలకు మరోసారి వదరల కష్టాలు రాకూడదని అన్నారు. ప్రణాళికలను అమలు చేసేలా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కూడా ఆయన చెప్పారు. అదే విధంగా వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అన్ని విధాలా వారిని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి.. కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను గురువారం సందర్శించారు. బాధితులను పరామర్శించారు. పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వంటి అంశాలపై ఆరా తీశారు. వరద బీభత్వంపై పెట్టిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతోనే వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు. వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలను తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తామని చెప్పారు.
రోడ్లు, పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి గారు స్థానికులతో మాట్లాడారు. కొడంగల్‌కు ఎంత మేరకు సాయం చేస్తానో కామారెడ్డి జిల్లాకు కూడా అంత సాయం చేస్తానని మాటిచ్చారు. వరద నష్టంపై గ్రామాల వారిగా అంచనాలు రూపొందించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జీలు, మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పంట నష్టానికి సహాయం అందిస్తామన్నారు. “వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది. నష్టపోయిన వారిని ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుంది. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో వరదల నష్టాన్ని అంచనా వేయాలి. పంట నష్ట పోయిన రైతులకు పరిహారం అందిస్తాం. రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు కూడా అంచనాలు రూపొందించాలి” అని ఆదేశాలు జారీ చేశారు.
“వరదల వల్ల ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు ప్రజలకు అండగా నిలిచారు. కష్టం వచ్చినప్పుడు అండగా ఉండే వారే నిజమైన నాయకుడు. ఎమ్మెల్యే గారి లాగే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నా. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టు భారీ వరదను కూడా తట్టుకుని నిలబడి అందర్నీ కాపాడింది. తాత్కాలిక మరమ్మతులు చేశాం. అయితే ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికే ఇక్కడికి వచ్చాం. నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం..” అని బాధితులకు భరోసానిచ్చారు.
వరదల వల్ల లింగంపేటలో దెబ్బతిన్న ఆర్ అండ్ బి బ్రిడ్జీని కూడా సీఎం పరిశీలించారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం తాత్కాలిక మరమ్మతులతో కాకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం బ్రిడ్జి కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయి అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున, పశుసంపద కోల్పోయిన వారికి తగిన ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.
“భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆస్తినష్టం జరిగినప్పటికీ అప్రమత్తంగా ఉండటం ప్రాణ నష్టం తగ్గించగలిగాం. వరదలు రాగానే క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందిగా జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క, సలహదారు షబ్బీర్ అలీ గారిని, ఎంపీ సురేష్ షేట్కర్ గారిని, ఎమ్మెల్యేలను ఆదేశించాను. ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేశా. ఇక్కడి సమస్యల పరిష్కారానికి వంద శాతం ప్రభుత్వం కృషి చేస్తుంది. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర సామగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటాం..” అని స్పష్టంగా చెప్పారు.