‘తెలంగాణ విద్యారంగానికి సాయం చేయండి’
x

‘తెలంగాణ విద్యారంగానికి సాయం చేయండి’

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ.


తెలంగాణ విద్యా రంగానికి కేంద్రం నుంచి సహాయం అందాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. ఇందులో తెలంగాణలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అంశాన్ని వివరించారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. అంతేకాకుండా ఇటీవల కురిసన భారీ వర్షాల కారణంగా తెలంగాణ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొందని వివరించారు. తెలంగాణ‌లో సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల్లోని పిల్ల‌ల‌కు కార్పొరేట్ త‌ర‌హా విద్య‌ను అందించేందుకు త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కేంద్ర మంత్రికి వివ‌రించారు.

ప్రతి నియోజకవర్గంలో ఒక పాఠశాల

రాష్ట్రంలోని 105 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే నాలుగు పాఠ‌శాల‌ల నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయ‌ని, మిగ‌తా పాఠ‌శాల‌ల‌కు సంబంధించి టెండ‌ర్లు ముగిశాయ‌ని వివరించారు. ఒక్కో పాఠ‌శాల‌లో 2,560 మంది విద్యార్థులు ఉంటార‌ని, 2.70 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ఈ పాఠ‌శాల‌ల్లో చదువుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని చెప్పారు రేవంత్ రెడ్డి.

రూ.21 వేల కోట్లతో స్కూల్స్

అత్యాధునిక వ‌స‌తులు, ల్యాబ్‌లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని వివ‌రించారు. అలాగే రాష్ట్రంలో జూనియ‌ర్‌, డిగ్రీ, సాంకేతిక క‌ళాశాలలు, ఇత‌ర ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రూ.9 వేల కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ నిధుల స‌మీక‌ర‌ణ‌కు ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటుకు అనుమ‌తించ‌డంతో పాటు ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితి నుంచి మిన‌హాయించాల‌ని నిర్మ‌లా సీతారామ‌న్‌‌కి విజ్ఞ‌ప్తి చేశారు.

పెట్టుబడిగా పరిగణించండి

రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యా రంగంపై చేస్తున్న వ్య‌యాన్ని పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించాల‌ని కోరారు. గ‌త ప్ర‌భుత్వంలో అధిక వ‌డ్డీల‌కు అప్పులు తీసుకువ‌చ్చింద‌ని, వాటి చెల్లింపు రాష్ట్ర ప్ర‌భుత్వానికి భారంగా మారిన నేప‌థ్యంలో వాటి రీస్ట్ర‌క్చ‌రింగ్‌కు అనుమ‌తించాల‌ని కోరారు. ముఖ్య‌మంత్రి రేవంత్ చేసిన విజ్ఞ‌ప్తుల‌పై నిర్మ‌లా సీతారామ‌న్ సానుకూలంగా స్పందించారు.

Read More
Next Story