దావోస్ పర్యటన ధ్యేయం చెప్పిన రేవంత్
x

దావోస్ పర్యటన ధ్యేయం చెప్పిన రేవంత్


దావోస్ పర్యటనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దావోస్‌ వేదికలో తెలంగాణ ముందున్న లక్ష్యాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ధ్యేయంగా తాము ముందడుగు వేయనున్నామని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, అలాగే క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) ప్రణాళికలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026లో ప్రపంచానికి పరిచయం అవుతున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

పెట్టుబడుల పురోగతి సమీక్ష

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన రెండు సంవత్సరాలలో దావోస్ వేదికగా రాష్ట్రానికి లభించిన పెట్టుబడి హామీలు, ప్రతిపాదనల పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో ఆకర్షించిన పెట్టుబడులు ఏ స్థాయిలో అమలయ్యాయన్న విషయాన్ని పరిశీలించారు.

క్యూర్, ప్యూర్, రేర్ ప్రణాళికలు

పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణకు ఇప్పటికే ఉన్న బలాలు, సామర్థ్యాలను మరింత వినియోగిస్తూ, మూడంచెల ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేలా రూపొందించిన క్యూర్, ప్యూర్, రేర్ ప్రణాళికలను తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వేదికగా వివరించనుంది.

“స్పిరిట్ ఆఫ్ డైలాగ్” థీమ్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 జనవరి 19 నుంచి 23 వరకు దావోస్‌లో జరగనుంది. గత పెట్టుబడిదారులతో చేసుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించి, అమలుపై ఫాలోఅప్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇన్వెస్ట్మెంట్ గ్రౌండింగ్‌లో సమస్యలు లేదా అడ్డంకులు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.

తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆర్థిక వృద్ధి ప్రణాళికలు, ప్రతిపాదనలను ప్రపంచ దేశాల పెట్టుబడిదారులకు సమర్థవంతంగా చేరవేయడానికి దావోస్‌లో విస్తృత స్థాయి సమావేశాలు, చర్చలు నిర్వహించనుంది.

Read More
Next Story