
కామారెడ్డిలో సీఎం రేవంత్ పర్యటన..
భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకూడదంటూ అధికారులకు ఆదేశాలు.
సీఎం రేవంత్ రెడ్డి.. కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో జరిగిన నష్టంపై సీఎం ఆరా తీశారు. లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అందుతున్న సహాయక కార్యక్రమాలు చూశారు. కుర్దులో వరదలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ వంతెనను ఆయన పరిశీలించారు. వంతెనను యుద్ధప్రాతిపదికన పునఃనిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఈ పర్యటనలో మంత్రులు పొంగులేటి, సీతక్క పాల్గొన్నారు. ప్రజల సమస్యలను సీఎం తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వరదల సమయంలో వంతెన పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా సీఎం పరిశీలించారు. అనంతరం అధికారులతో వంతెన అంశంపై చర్చించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ, బ్రిడ్స్ కమ్ చెక్‌డ్యామ్ తరహాలో నిర్మాణం చేపట్టాలని సూచించారు. అందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పారు. పూర్తి స్థాయి అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్పారు.
జలదిగ్బంధమైన కామారెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలను జలప్రళయం కంపింపజేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై గత వర్షపాతం రికార్డులను బద్ధలు చేసింది.కామారెడ్డి జిల్లాలో కురిసిన కుండపోత వర్షపాతం గత తెలంగాణ రికార్డులను చెరిపేస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పింది. అల్పపీడన ప్రభావం, నైరురుతువపనాల ప్రభావం, తూర్పు, పడమర దిశల నుంచి తేమ వ్యాపించడంతో అతి భారీవర్షాలు కురిశాయి. దీని వల్ల వందలాది చెరువులు, నాలాలు తెగిపోయి వరదనీరు గ్రామాలపై పడి జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. తెలంగాణలో జలప్రళయాల్లో కామారెడ్డిది రికార్డు అని చెప్పవచ్చు. తెలంగాణలోనే అత్యధిక వర్షపాతం నమోదై కామారెడ్డి వర్షాల చరిత్రను తిరగరాసింది. ఒక్క రోజులో 41 సెంటీమీటటర్ల వర్షంతో కామారెడ్డి కకావికలమైంది. 2008వ సంవత్సరం ఏప్రిల్ 8వతేదీన ఆదిలాబాద్ జిల్లాల్లో కేవలం 24 గంటల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.నాడు ఆదిలాబాద్ జిల్లా జలమయం అయింది.గత ఏడాది(2024) జనవరి 9వతేదీన భద్రాచలంలో 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది.1908వ సంవత్సరం సెప్టెంబరు 28వతేదీన హన్మకొండలో 30 సెంటీమీటర్లు, 1954 వ సంవత్సరం అక్టోబరు 7వతేదీన ఖమ్మం జిల్లాలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.