‘మంత్రికి గౌరవం ఇవ్వండి కానీ.. వాళ్లు చెప్పారని ఉద్యోగం ఇవ్వకండి’
x

‘మంత్రికి గౌరవం ఇవ్వండి కానీ.. వాళ్లు చెప్పారని ఉద్యోగం ఇవ్వకండి’

ఓయూను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే బాధ్యత తనదన్న సీఎం రేవంత్.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీపై వరాల జల్లు కురిపించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే బాధ్యత తనదన్నారు. అంతేకాకుండా టాలెంట్ ఉన్నవారికే పదవోన్నతులు, బాధ్యతలు ఇవ్వబడతాయని అన్నారు. అంతేకాకుండా ఎవరు పైరవీలు చేసినా తన దృష్టికి తీసుకురావాలని, వారి ఉద్యోగాలు ఊడబీకే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. తమ ప్రభుత్వ మంత్రులు వస్తే గౌరవించండని, టీ ఇవ్వండి కానీ వాళ్లు చెప్పిన వారికి టీచర్లుగా ఉద్యోగాలు ఇవ్వొద్దని కోరారు. ఒక అనర్హుడికి టీచర్‌గా ఉద్యోగం ఇస్తే.. వందల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన వాళ్ల మవుతామన్నారు. అలాంటి నిర్ణయాలు తాను తీసుకోనని, విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసే హక్కు ఎవరికీ లేదని పునరుద్ఘాటించారు. బుధవారం రేవంత్.. ఓయూలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను పంచుకున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంతో సందడి చేసింది. యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన సీఎం, ఓయూ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, విద్యా సంస్కరణలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, ‘‘ఓయూకి రావాలంటే ధైర్యం కాదు… అభిమానం కావాలి. గుండెల నిండా అభిమానంతోనే ఇక్కడికి వచ్చాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఇదే’’ అని ఆయన పేర్కొన్నారు.

ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాట చరిత్ర

‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే ఎందుకంత ధైర్యం చేస్తున్నావని నన్ను కొంతమంది అడిగారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కావాల్సింది ధైర్యం కాదు.. అభిమానం. గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని యూనివర్సిటీకి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చా.. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చా. తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉంది’’ అని అన్నారు.

సామాజిక న్యాయం కోసం జరిగిన ఉద్యమం

‘‘తెలంగాణ వచ్చినప్పుడు విద్యార్థులు ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు అడగలేదు… స్వేచ్ఛ, సమాన అవకాశాలు మాత్రమే అడిగారు. మా ప్రభుత్వం అదే అందిస్తుంది’’ అని సీఎం స్పష్టం చేశారు. ‘‘మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచింది. తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదు. మా తమ్ముల్లు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నాం. పదేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని అంటున్నారు. అవును.. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా’’ అని అన్నారు.

‘‘నేనేం గుంటూరులో చదువుకోలేదు.. నాకు గూడుపుఠానీ తెలియదు. నాకు విదేశీ భాష రాకపోవచ్చు.. కానీ నాకు పేదవాడి మనసు చదవడం వచ్చు.. పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు. పేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. చేతనైతే ఆర్ట్స్ కాలేజీకి రమ్మని ఒకాయన గతంలో సవాల్ విసిరాడు. నాకేం ఫామ్ హౌసులు లేవు.. నేనేం ప్రజల సొమ్ము దోచుకోలేదు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా’’ అని తెలిపారు.

రెండు సంవత్సరాల్లో చేసిన నిర్ణయాల జాబితా

‘‘చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే నా ఆకాంక్ష. రెండేళ్లల్లో మీరేం చేశారని కొందరు అడుగుతున్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెడితే రాష్ట్ర గీతంగా గుర్తించాం. పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు. బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేసి సామాజిక న్యాయం చేశాం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం. కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన చేపట్టే పరిస్థితులు కల్పించాం’’ అని పేర్కొన్నారు.

విద్యతోనే వెనుకబాటుతనానికి చెక్

‘‘కులం అడ్డుగోడలను తొలగించేందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఆనంద్ మహీంద్రా చైర్ పర్సన్ గా, గొప్ప వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి మీకు స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశాం. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. గొప్ప గొప్ప వ్యక్తులను బోర్డ్ డైరెక్టర్లుగా నియమించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారు’’ అని అన్నారు.

‘నా తపన అంతా ఒక్కటే’

‘‘పేదలకు ఏదైనా చేయాలనేదే నా తపన. అందుకే రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించాం. తెలంగాణకు పట్టిన చీడ, పీడను ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. ఇంగ్లీషు భాష ఒక కమ్యూనికేషన్ మాత్రమే.. అది నాలెడ్జ్ కాదు. మనకు నాలెడ్జ్, కమిట్ మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశాం. ఇందులో ఎలాంటి పొలిటికల్ ఆబ్లిగేషన్ లేదు.

పిల్లల భవిష్యత్ ను చెడగొట్టే అధికారం ఎవరికీ లేదు’’ అని అన్నారు. ‘‘ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. పిల్లల భవిష్యత్ ను ఉన్నతంగా తీర్చిదిద్దే కమిట్ మెంట్ ఉన్న వారిని నియమించుకొండి’’ అని వ్యాఖ్యానించారు.

విద్యార్థులకు ముఖ్యమంత్రి పిలుపు

‘‘విద్యార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి… నిబద్ధతతో నిరంతరం కష్టపడండి.. తప్పకుండా ఫలితం వస్తుంది. మీరంతా డాక్టర్లు, లాయర్లు, ఉన్నతాధికారులు కావాలి. యూనివర్సిటీ నుంచి నాయకులై రాష్టాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నా’’ అని సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.

Read More
Next Story