కాంగ్రెస్ అభ్యర్థులకు సీఎం దిశానిర్దేశం
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో సోమవారం ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎంల కౌంటింగ్ జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్గా పంపాలి. సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూడాలి. ప్రతి రౌండ్ కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గరా 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలి. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలి. అభ్యర్థులందరూ వీటిపై అవగాహనతో ఉండాలి” అని రేవంత్ సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 34 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. 4వ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1,855 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లలో, అత్యల్పంగా మూడుచోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతామని తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.