వరద బాధిత ప్రాంతాల్లో నేడు సి.ఎం. ఏరియల్ సర్వే
x
వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఏరియల్ సర్వే

వరద బాధిత ప్రాంతాల్లో నేడు సి.ఎం. ఏరియల్ సర్వే

తెలంగాణలో భారీవర్షాలు వరదలతో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.


తెలంగాణలోని భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గురువారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు బుధవారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు.ముఖ్యమంత్రి ఆదేశాలపై మరోసారి సహాయ, పునరావాస కార్యక్రమాలు, ఆస్తి, ప్రాణ నష్టం నివారణపై చేపట్టిన చర్యలను సమీక్షించారు. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్సర్వీసుల శాఖ డీ.జి నాగిరెడ్డి, వరద బాధిత జిల్లాలకు నియమితులైన స్పెషల్ అధికారులు కూడా ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.


గురువారం కూడా భారీ వర్షాలు
గత 24 గంటలలో అత్యంత భారీ వర్షాలు కురిసిన్నప్పటికీ, పాలనా యంత్రాంగం సకాలంలో చేపట్టిన చర్యలతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగామని సీఎస్ చెప్పారు. గురువారం కూడా వర్షాలు పడే అవకాశమున్నందున జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు.నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని తెలిపారు.



పోచారం జలాశయానికి తప్పిన ప్రమాదం

పోచారం జలాశయానికి నీటి ఇన్-ఫ్లో తగ్గినందున ఈ రిజర్వాయర్ ప్రమాదం నుంచి బయట పడ్డట్టే అని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. వరద నీటిలో చిక్కుకున్న రూప్ సింగ్ తండా, వాడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఎస్ ఆర్ ఎస్ పీ నుంచి మూడు లక్షల క్యూసెక్కుల జలాలను, నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్షా 90 వేలక్యూసెక్కుల జలాలను వదులుతున్నందున, దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు.

వరదబాధితులకు పునరావాసం
కల్వర్టులు, పొంగుతున్న వాగులు, లోతట్టు ప్రాంతాల వద్ద తగు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి, ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలనుంచి పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి తగిన ఆహారం, మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలను అందించాలని ఆదేశించారు. వర్షాల వాళ్ళ దెబ్బతిన్న విధ్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే పునరుద్దరించాలని కోరారు.

అప్రమత్తంగా ఉండండి
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు సంబంధిత అన్ని విభాగాల అధికారులతో అత్యవసర టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి గ్రామం, పట్టణంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు.లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు.


Read More
Next Story