అసభ్య పోస్టులపై సీఎం హెచ్చరికలు, చర్యలకు తెలంగాణ పోలీసుల సమాయత్తం
x

అసభ్య పోస్టులపై సీఎం హెచ్చరికలు, చర్యలకు తెలంగాణ పోలీసుల సమాయత్తం

సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిని ఉప్పు పాతరేస్తామని సీఎం ఎ రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు చర్యలకు సమాయత్తం అయ్యారు.


జర్నలిస్టుల ముసుగులో సామాజిక మాధ్యమాల్లో కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారిని ఉప్పుపాతరేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే బహిరంగంగా ప్రకటించారు. ఇంట్లో ఆడవారిని సామాజిక మాధ్యమాల్లో తిడుతున్న వారిని, వారికి వంతపాడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదని సీఎం హెచ్చరించారు.

సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో జర్నలిస్టుల పేరిట విషం చిమ్ముతున్న వారి భరతం పడతామని సీఎం తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. జర్నలిస్టుల ముసుగులో యూ ట్యూబ్ ఛాలెల్ పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడే వారి ఆటలు సాగనివ్వనని, వారిని శిక్షించేందుకు చట్టాలు చేస్తామని సీఎం చెప్పారు. పెయిడ్ ఆర్టిస్టులను పార్టీ కార్యాలయాల్లో పెట్టి రికార్డు చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టే వారిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.


తెలంగాణ డీజీపీ ప్రకటన
అసెంబ్లీలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అయ్యారు. ‘‘సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసేవాళ్లు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించాలి. అంతేకానీ డబ్బుల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలుంటాయి. జీవితాలను నాశనం చేసే బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసేవారిపై నిఘా ఉంటుందని గుర్తుంచుకోండి’’అంటూ తెలంగాణ డీజీపీ జితేందర్ ఎక్స్ పోస్టులో హెచ్చరించారు.

బెట్టింగ్‌ యాప్స్‌ జోలికి వెళ్లొద్దు
బెట్టింగ్ అనేది విషవలయమని, సరదా కోసం కూడా బెట్టింగ్‌ యాప్స్‌ జోలికి వెళ్లొద్దు అని తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్పారు. సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే ప్రమోషన్లకు ఆకర్షితులు కావొద్దని ఆయన కోరారు. బెట్టింగ్ యాప్స్‌ ఎవరైనా వాడుతున్నట్లు గుర్తిస్తే వారికి అవగాహన కల్పించాలని డీజీపీ పోలీసులను ఆదేశించారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై కేసు
సీఎం రేవంత్ రెడ్డిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ పల్స్ టీవీ ఛానల్ చేసిన వీడియోపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.ఇలాంటి వీడియోలు సమాజంలో రెచ్చగొట్టే విధంగా, శాంతిభద్రతలకు విఘాతం కల్పించే అవకాశముందని సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు.పొగడదండ రేవతి,బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్ లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


Read More
Next Story