
కాల్వ గట్టు మార్గంలో ట్రాక్టరుపై ప్రయాణిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ, కలెక్టర్ ప్రావీణ్యలు
కాల్వగట్టు మార్గంలో ట్రాక్టరుపై కలెక్టర్, మంత్రి ప్రయాణం..ఎందుకంటే...
వరద విపత్తు సమయంలో మంత్రి, కలెక్టర్, ఎస్పీలు ట్రాక్టరుపై కాల్వకు గండి పడిన ప్రాంతాన్ని సందర్శించారు.
భారీవర్షాలు, వరద నీటి ప్రవాహంతో సింగూరు ప్రాజెక్టు కాల్వకు గండి పడింది. సింగూరు ప్రాజెక్టు పరిధిలోని పుల్కల్ మండలం ఇసోజు పేట గ్రామంలో సాగునీటి కాల్వకు వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో ఈ గండి పడింది. దీనివల్ల రైతులకు ఇబ్బందులు లేకుండా వెంటనే కాల్వ కు పడిన గండికి వెంటనే మరమ్మతులు మొదలుపెట్టారు. మరమ్మతులను స్వయంగా పరిశీలించేందుకు జిల్లాకు చెందిన వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఇరిగేషన్ అధికారులతో కలసి వచ్చారు.రైతులకు ఇబ్బందులు లేకుండా వెంటనే కాల్వ కు పడిన గండికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి రాజనర్సింహ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు .
అధికారులూ అప్రమత్తంగా ఉండండి
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశించారు. భారీవర్షాలు, వరదలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించి వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సింగూరు కాల్వకు గండి పడిన ప్రాంతానికి రోడ్డు మార్గం లేక పోవడంతో మంత్రి అధికారులతో కలిసి ట్రాక్టరుపై కాల్వ గట్టుపైనే ప్రయాణించారు.గండి పడిన కాల్వకు వెళ్లే దారి బురదతో ఉండటంతో ట్రాక్టరును ఎంచుకొని దానిలో కింద కూర్చొని ప్రయాణించి కాల్వకు పడిన గండిని తక్షణం పూడ్చాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
సింగూరు ప్రాజెక్టు భద్రతకు చర్యలు
సింగూర్ ప్రాజెక్టు పరిస్థితిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా జిల్లా కలెక్టరు ప్రావిణ్య తో కలిసి పరిశీలించారు.సేఫ్టీ కమిటీ సూచనల మేరకు డ్యామ్ సురక్షితతపై ప్రత్యామ్నాయ మార్గాలను,జలాశయం భద్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
నారింజ వాగు వద్దకు రావద్దు
జహీరాబాద్ మండలంలోని నారింజ వాగులో వర్షానికి వచ్చే వరదను, ప్రాజెక్టు నీటి సామర్ధ్యాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు. వరదల నేపథ్యంలో వాగు దగ్గరికి ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ అధికారులకు కలెక్టరు ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
జహీరాబాద్ మండలం బుచ్చినెల్లి గ్రామం వెళ్లే మార్గంలోని బ్రిడ్జిని జిల్లా కలెక్టరు పి ప్రావీణ్య పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో నదులు, వాగులు,చెరువులు,కల్వర్టులు,బ్రిడ్జిల దగ్గరకు వెళ్ల వద్దని ప్రజలకు కలెక్టరు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే 08455-276155 ఫోన్ నంబరులో సంప్రదించి అవసరమైన సహాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. అత్యవసరం లేకపోతే ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. జిల్లాలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఆమె వెల్లడించారు.
Next Story