ఖమ్మం కనకగిరి కమనీయ అందాలు తిలకిద్దాం రండి
x
పులిగుండాల సరస్సు నుంచి గలగల పారుతున్న నీటి సెలయేరు (ఫొటో :అటవీశాఖ సౌజన్యంతో)

ఖమ్మం కనకగిరి కమనీయ అందాలు తిలకిద్దాం రండి

కొండ కోనల్లో, పచ్చని చెట్లు, జాలువారుతున్న జలపాతాలు,నీటి సెలయేర్లు, వన్యప్రాణులు, పక్షుల కిలకిలరావాలతో కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.


చుట్టూ కొండలు,కోనలు, గుట్టలు...కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు...జలజల పారుతున్న పులిగుండాల ప్రాజెక్టు సెలయేరు...కిలకిలరావాలతో సందడి చేస్తున్న పక్షులు...జింకలు, చిరుతలు,వివిధ రకాల వన్యప్రాణులు... ఎతైన పచ్చని చెట్లతో అలరారుతున్న దట్టమైన అడవులు...ఇవీ పులిగుండాల కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ అందాలు...కనకగిరి అడవుల్లో పర్యావరణ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ వినూత్న ప్రణాళికను రూపొందించింది. ఈ నేపథ్యంలో ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి కనకగిరిలో కమనీయ ప్రకృతి సోయగాలను (Beauty of Kanakagiri Reserve Forest) పాఠకుల కళ్లకు కట్టినట్లు అందిస్తున్న సమగ్ర కథనం...




కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కడుందంటే...

రాజధాని నగరమైన హైదరాబాద్ కు 220 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం నగరానికి 60 కిలోమీటర్ల దగ్గరలో ఖమ్మం-అశ్వరావుపేట్ 42వ నంబరు జాతీయ రహదారిపై ఉన్నరామకృష్ణాపురం గ్రామానికి 11.5కిలోమీటర్ల దూరంలోని సత్తుపల్లి అటవీ రేంజ్ తల్లాడ రిజర్వు ఫారెస్ట్ బ్లాక్ లో పులిగుండాల కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది.



పర్యావరణ పర్యాటక కేంద్రంగా పులిగుండాల ప్రాజెక్ట్

ఖమ్మం జిల్లాలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లో సహజ సుందరంగా ఉన్న పులిగుండాల ప్రాజెక్ట్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ 14,422 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.వర్షాకాలంలో మినీ జలపాతంలో నీరు ప్రవహిస్తుంది.ఈ అటవీ ప్రాంతం వలస పక్షులతో సహా వృక్షజాలం ,జంతుజాలంతో జీవవైవిధ్యానికి నిలయంగా మారింది.



కనకగిరి కొండ కోనల్లో...
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కనకగిరి రిజర్వ్ ఫారెస్టుతో విస్తరించింది. కనకగిరి ఆర్.ఎఫ్. వరుస కొండలతో చుట్టుముట్టిన సుందరమైన ప్రదేశం.ఈ ప్రాంతం అందాలను పర్యాటకులకు అందించేందుకు పులిగుండల ప్రాజెక్ట్‌ను ఎకో-టూరిజం గమ్యస్థానంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతంలో ప్రకృతి పరిరక్షణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రూ.67 లక్షల రూపాయలతో ఈ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు.



జాలువారుతున్న జలపాతం

కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లోని చిన్న జలపాతం వర్షాకాలంలో పై కొండ నుంచి నీరు జాలువారుతూ తీగ గుండా ప్రవహిస్తుంది.ప్రకృతి అందాలతో పర్యావరణ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న కనకగిరి ప్రాంతాన్ని తాము అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అధికారి సామినేని శ్రీనివాసరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పర్యావరణ పర్యాటక రంగ అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులకు మర్చిపోలేని మధుర స్మృతులను మిగిలిస్తామని శ్రీనివాసరావు వివరించారు.



పులిగుండం మధ్య సఫారీ ట్రాక్

కనకగిరి ప్రాంతం వలస పక్షులతో సహా భారీ వృక్షజాలం, జంతుజాలంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పులిగుండంతో అనుసంధానిస్తూ 15 కిలోమీటర్ల సఫారీ ట్రాక్ నిర్మించాలని ప్రతిపాదించారు.అడవిలో 15 కిలోమీటర్ల ఘాట్ ఏరియాతో జంగిల్ సఫారీని నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో వర్షాకాలం తప్ప ఏడాది పొడవునా సఫారీ రైడ్‌లు ఏర్పాటు చేయనున్నారు.ఈ అడవుల్లో సహజ జలపాతం, శాశ్వత నీటి వనరులున్నాయి.



బర్డ్ వాచింగ్ సెంటర్

వివిధ రకాల పక్షులను వీక్షించడానికి కనకగిరి కేంద్రంగా మారనుంది. ప్రశాంతమైన సుందరమైన జలసంధిలో ఏడాది పొడవునా పుష్కలంగా నీరు ఉంటుంది.బోటింగ్, పక్షులను వీక్షించడం, వన్యప్రాణులను వీక్షించడం వంటి వివిధ కార్యకలాపాలతో పర్యాటకులను ఆకర్షించాలని నిర్ణయించారు. ఈ అడవుల్లోని సహజసిద్ధ అటవీ మార్గాల్లో సఫారీ యాత్ర చేయవచ్చు. దీంతో పాటు అడవుల్లో నక్షత్రాలను వీక్షించవచ్చునని ఖమ్మం డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు. కనకగిరిలో బర్డ్ వాచింగ్ ఈవెంట్లు నిర్వహిస్తామని డీఎఫ్ఓ చెప్పారు.



ఎన్నెన్నో రకాల పక్షుల కిలకిలరావాలు

కనకగిరి అటవీ ప్రాంతంలో పలు రకాల పక్షుల కిలకిలరావాలతో మార్మోగుతుంటుంది. ఈ అడవుల్లో ఫ్లైక్యాచర్,టెర్ప్సిఫోన్ పారడిసి, షిక్రా (అక్సిపిటర్ బాడియస్),ఇనిడాన్ రోలర్ (కొరాసియాస్ బెంగాలెన్సిస్), పొలుసుల రొమ్ము మునియా(లోంచురా పంక్చులేట్).తెల్లని నుదురు వాగ్‌టైల్ (మోటాసిల్లా మడెరాస్పటెన్సిస్) చిన్న గోధుమ పావురాలు అడవుల్లో కనిపిస్తుంటాయి. చెట్లపైనే ట్రీ హౌస్ ను నిర్మిస్తున్నారు.



కనకగిరిలో చేపడుతున్న అభివృద్ధి పనులు

ఈ అడవుల్లో పగోడా వ్యూపాయింట్ ను నిర్మించనున్నారు. లియోపార్డ్ వాచ్ టవర్, సెల్ఫీ పాయింట్ సిద్ధం చేయనున్నారు. అడవుల్లో మినీ బ్రిడ్జీలు, కల్వర్టులు కూడా నిర్మించాలని నిర్ణయించారు. పక్షులను వీక్షించేందుకు వీలుగా పాలపిట్ట వాచ్ టవర్ నిర్మించనున్నారు. అడవుల్లో ట్రెక్కింగ్ మార్గాలను కూడా సిద్ధం చేస్తున్నారు. అడవుల్లో నైట్ క్యాంపింగ్ పర్యాటకుల కోసం సోలార్ 360 డిగ్రీల కెమెరాలు, విద్యుత్ దీపాలను అమర్చనున్నారు.అడవిలో రచ్చబండ నిర్మించనున్నారు. వాచర్స్, గైడ్స్ ను నియమించి వారికి వాకీటాకీలు ఇవ్వనున్నారు. పులిగుండల ప్రాజెక్ట్‌ను చిరుతపులి వాచ్ టవర్‌కు అనుసంధానించేలా సఫారీని నిర్మిస్తున్నారు. పులిగుండాల రిజర్వాయరులో మోటారు బోట్లతో బోటింగ్ అండ్ కయాకింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. సరస్సులో ఫ్లోటింగ్ హౌస్ నిర్మించనున్నారు.కనకగిరి అటవీ అందాలను పర్యాటకులకు చూపించేందుకు తాము ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మేనేజరు కళ్యాణపు సుమన్
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు.



పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి

కనకగిరి కమనీయ అటవీ అందాలను పర్యాటకులకు చూపించడం ద్వారా స్థానిక అటవీ గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. వన్యప్రాణుల వేటను నిరోధించి వీటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోనున్నారు.ఈ అడవుల్లో ట్రెక్కింగ్ ద్వారా యువతకు పర్యావరణంపై అవగాహన కల్పించనున్నారు. అడవిలో ఉన్న హత్సల వీరన్న, వీరభద్ర స్వామి దేవాలయాల సందర్శనకు అవకాశం కల్పించనున్నారు.


Read More
Next Story