
కమ్యూనిస్ట్‌లపై రేవంత్ వ్యాఖ్యలు ఆయనకైనా అర్థమయ్యాయా..!
2023లో మేము అధికారంలోకి రావడానికీ కమ్యూనిస్టులే కారణం కావొచ్చన్న సీఎం.
కమ్యూనిస్టులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు దారితీస్తున్నాయి. రేవంత్ రెడ్డి.. కమ్యూనిస్టులను పొగిడారా.. తిట్టారా అన్న చర్చ బలంగా జరుగుతుంది. మరోవైపు అసలు కమ్యూనిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రేవంత్‌కు అయినా అర్థమయ్యాయా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ మాటలు కమ్యూనిస్టులకు అర్థమయ్యాయా ముందు? అని మరికొందరు చురకలంటిస్తున్నారు. ఇందుకు కారణం.. కమ్యూనిస్టులు ఏ ప్రభుత్వాన్ని అయినా గద్దె దించడానికి ముందుంటారని రేవంత్ అనడమే. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. కమ్యూనిస్టులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పొగిడారా.. తిట్టారా..
రేవంత్ తన ప్రసంగంలో కమ్యూనిస్టులను పొగిడారా? తిట్టారా? అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిస్ట్‌లు ఏ ప్రభుత్వాన్ని అయినా గద్దె దించడానికి ముందుంటారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కమ్యూనిస్ట్‌లు ఏ ప్రభుత్వాన్ని అయినా నిలబెట్టగలరని, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించగలరని అనకుండా ప్రభుత్వాన్ని దించడంలోనే వారు ముందుంటారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు ఆ వ్యాఖ్యల వెనక రేవంత్ రెడ్డి భావన ఏంటి?’’ అని విశ్లేషకులు చర్చిస్తున్నారు.
అంతేకాకుండా రేవంత్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకయినా అర్థమయిందా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అందుకు కారణం.. రాష్ట్రంలో కమ్యూనిస్టు నేతల సంఖ్య. ప్రస్తుతం సీపీఐ తరుపున ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అది కూడా కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన స్థానాల్లో ఒకదానిని గెలుచుకున్నారు. అంటే ఆ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరూ పోటీ చేయలేదు. అదే అలా కాకుండా ఒంటరిగా పోటీ చేసి ఉంటే సీపీఐకి ఆ ఒక్క స్థానం కూడా డౌటే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీపీఐ అభ్యర్థికి కాంగ్రెస్ పూర్తి సహకారం ఇవ్వడం వల్లే ఆ ఒక్కరైనా గెలిచారు. లేకుండా అది జరిగేది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై గొంతెత్తడానికే చెప్పుకోదగ్గ సంఖ్యలో కూడా ప్రజాప్రతినిధులు లేని కమ్యూనిస్ట్‌లు ప్రభుత్వాన్ని గద్దెను ఏమాత్రం దించగలరు అని విశ్లేషకులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కూటమిలో ఉన్న కారణంగా రేవంత్.. కమ్యూనిస్టులను పొగుడుతున్నట్లు మాట్లాడి ఉంటారని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ప్రస్తుతం కేరళలో తప్ప మరే ఇతర రాష్ట్రంలో కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం లేదని విశ్లేషకులు అంటున్నారు. జాతీయ స్థాయిలో నేతలు ఉన్నప్పటికీ ప్రాధాన్యత లేని పార్టీగా కమ్యూనిస్ట్ మిగిలిపోయిందని పలువరు మేధావులు కూడా తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని చురకలంటిస్తున్నారు.
ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే..
“కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పత్రికలు ప్రజల పక్షాన నిలబడి చైతన్యం చేయడంలో విశేష కృషి చేశాయి. అందరికీ ఆదర్శంగా నిలబడ్డాయి. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంతో పాటు బాల్య వివాహాలు, కులాల మధ్య అంతరాలు, జోగినీ వ్యవస్థ.. వంటి సమాజంలోని అనేక రుగ్మతలపై ప్రజలను చైతన్యం చేశాయి’’ అని రేవంత్ పేర్కొన్నారు. ‘‘తప్పు చేసేవాళ్లను గద్దె దించడంలో కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుంటారు. వారు ఉప్పు లాంటి వారు. ఎన్ని మసాలాలు ఉన్నా.. ఉప్పు లేకపోతే వంటకు రుచి ఉండదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాలు ఉపయోగపడ్డాయి. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే.. ఆనాడు విద్యుత్ ఉద్యమాలను లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లింది కమ్యూనిస్టు సోదరులని నమ్ముతున్నా. 2023లో మేము అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వీరభద్రం చేసిన పాదయాత్రలు, పోరాటాలు కారణం కావొచ్చు. ప్రజా పాలనను కొనసాగించడానికి కూడా మీ సహకారం కావాలి’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.