
సినిమా నటుడు శ్రీకాంత్ పై ఫిర్యాదు
శనివారం కాంగ్రెస్ ఎంఎల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) సిటీ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేశాడు
తెలుగు సినిమా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. జాతిపిత మహాత్మాగాంధీపై ఈమధ్యనే అయ్యంగార్(Srikanth iyengar) సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ప్రపంచం అంతా ఎంతో గౌరవించే మహాత్మా గాంధీ(Mahatma Gandhi)ని పట్టుకుని అయ్యంగార్ వాడు..వీడు అంటు ఇష్టంవచ్చినట్లు నోరుపారేసుకున్నాడు. దానిపై శనివారం కాంగ్రెస్ ఎంఎల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) సిటీ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. మహాత్మా గాంధీని కించపరుస్తు అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలపై కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో ఎంఎల్సీ అడిగారు. భవిష్యత్తులో మరెవరూ మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని వెంకట్ కోరారు.
గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అయ్యంగార్ సభ్యత్వాన్ని వెంటనే మా అసోసియేషన్ తొలగించాలని డిమాండ్ చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కూడా అయ్యంగార్ పై ఫిర్యాదు చేయబోతున్నట్లు ఎంఎల్సీ చెప్పారు. అనేక విషయాలపై చాలా వేగంగా స్పందించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షర్స్ అయ్యంగార్ విషయంలో స్పందిచకపోవటాన్ని బల్మూరి తప్పుపట్టారు. అల్లుఅర్జున్ విషయంలో స్పందించిన ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు మహాత్ముడిపై అయ్యంగార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించకపోవటం చాలా బాధాకరమన్నారు.
అయ్యంగార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతధోరణికి దారితీస్తుందని ఎంఎల్సీ ఆందోళన వ్యక్తంచేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది తమ జీవితాలను త్యాగంచేసిన విషయాన్ని వెంకట్ గుర్తుచేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఎవరిపాత్రను వాళ్ళు పోషించినట్లు చెప్పారు. చేసిన త్యాగాల్లో ఒకరిది తక్కువ కాదు మరొకరిది ఎక్కువకాదన్న విషయం అందరికీ తెలుసన్నారు. ప్రపంచమంతా ఎంతో గొప్పగా కీర్తించే మహాత్ముడిపై అయ్యంగార్ నోటికొచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటని వెంకట్ మండిపోయారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ అసలు ఏమిచేశాడని అయ్యంగార్ ప్రశ్నించటమే ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా వెంకట్ ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్ళపై కఠినచర్యలు తీసుకుంటేనే రేపు మరొకరు నోటికొచ్చినట్లు మాట్లాడకుండా ఉంటారని బల్మూరి వెంకట్ అభిప్రాయపడ్డారు.