రాజకీయాల్లో కాంప్రమైజ్ కంపల్సరీ: మహేష్
x

రాజకీయాల్లో కాంప్రమైజ్ కంపల్సరీ: మహేష్

కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా యూత్ కాంగ్రెస్ పనిచేయాలి. కష్టపడి పనిచేసిన వారికి రానున్న ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామని మహేష్ కుమార్ అన్నారు.


కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం దొరకడం ఒక అదృష్టమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయాలు అంటే ఒంటెద్దుపోకడ కాదని, పాలిటిక్స్‌లో కాంప్రమైజ్ అనేది కంపల్సరీ అని ఆయన అన్నారు. సమయానుసారంగా నడుచుకుంటేనే రాజకీయాల్లో రాణించగలుగుతామని చెప్పారు. మహేశ్వరం గట్టుపల్లిలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంప్‌కు మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎంత మంది ఉన్నా..యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.

‘‘రాజీవ్ గాంధీ తరాలోనే రాహుల్ గాంధీ కూడా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. ఏఐసీసీ మహామహులు NSUI నుంచి వచ్చిన వారే. హిమాచల్ సీఎం, అరుణాచల్ మాజీ ముఖ్య మంత్రి వంటి నేతలు NSUI నుంచి వచ్చిన వారే. ఓపిక.. నిబద్ధత.. క్రమశిక్షణ గల కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు వరిస్తాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా నేను ఉదాహరణగా చెబుతున్నా.. రాజకీయాల్లో కాంప్రమైజ్ కంపల్సరీ.. పరిస్థితులకు తగ్గట్టుగా సమయానుసారం నడుచుకోవాలి’’ అని కోరారు.

‘‘వెనక్కి తిరిగి చూడకుండా నిరంతరం కష్టపడాలి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నా సలహా. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా యూత్ కాంగ్రెస్ పనిచేయాలి. కష్టపడి పనిచేసిన యూత్ కాంగ్రెస్ నేతలకు రానున్న ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు స్వేచ్ఛ ఉంటుంది.. రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం ప్రశ్నించే హక్కు ఉంటుంది’’ అని తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ రాహుల్ గాంధీదే అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

Read More
Next Story