జూపల్లి వర్సెస్ సీనియర్ ఐఏఎస్ రిజ్వి
x
Minister Jupalli and senior IAS officer Rizvi

జూపల్లి వర్సెస్ సీనియర్ ఐఏఎస్ రిజ్వి

తనఆదేశాలను ఖాతరుచేయకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్న రిజ్విపై కఠినచర్యలు తీసుకోవాలని లేఖలో చీఫ్ సెక్రటరీని మంత్రి కోరారు.


సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ ఆలీ ముర్తాజా రిజ్వీకి మధ్య విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నది. రిజ్వి ముందస్తు రిటైర్మెంటుకు దరఖాస్తును తిరస్కరించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అని మంత్రి పట్టుబట్టారు. రిజ్విపై చర్యలకు మంత్రి చీఫ్ సెక్రటరీకి లేఖరాయటం సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి (Minister Jupally Krishna Rao)ఆదేశాలను అదేశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వి ఖాతరుచేయకుండా తనిష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. ఇదేవిషయమై మండిపోయిన మంత్రి రిజ్విపై కఠిన చర్యలకు లేఖరాశారు.

ఇంతకీ వివాదం ఏమిటంటే మద్యంబాటిళ్ళపై అతికించే లేబుళ్ళ సరఫరాచేసే కంపెనీల కాంట్రాక్టును మార్చాలని మంత్రి ఆదేశించారు. అలాగే బాటిళ్ళపై అతికించే హై సెక్యూరిటి హాలోగ్రామ్ పనితీరుపై నియమించిన నిపుణుల కమిటి సమావేశాలను కూడా రిజ్వి పెట్టలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. హాలోగ్రామ్ సరఫరాచేసే కంపెనీలను మార్చాలని మంత్రి ఆదేశించినా రిజ్వి పట్టించుకోకుండా తనిష్టం వచ్చిన కంపెనీలకు కాంట్రాక్టు రెన్యువల్ చేశారు. కాంట్రాక్టు కంపెనీని తనిష్టప్రకారమే ఎంపికచేసినట్లు రిజ్విపై ఆరోపణలున్నాయి.

ఒకవైపు తనఆదేశాలను ఖాతరుచేయకుండా తనిష్టం వచ్చినట్లు రిజ్వి వ్యవహరిస్తున్నారని మంత్రికి బాగా ఆగ్రహంగా ఉంది. మరోవైపు ఐఏఎస్ అధికారి వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్(వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును చీఫ్ సెక్రటరీ ఆమోదించేశారు. ఈనెల 31వ తేదీనుండి రిజ్వి రిటైర్మెంట్ అమల్లోకి వస్తుందని చీఫ్ సెక్రటరీ చెప్పారు.

ఈవిషయం తెలిసిన వెంటనే మంత్రి చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఎక్సైజ్ శాఖలో కాంట్రాక్టులను తనిష్టం వచ్చినట్లు ఖరారుచేయటమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించారు. తనఆదేశాలను ఖాతరుచేయకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్న రిజ్విపై కఠినచర్యలు తీసుకోవాలని లేఖలో చీఫ్ సెక్రటరీని మంత్రి కోరారు. అలాగే చర్యలు తీసుకోవటానికి ఆమోదించిన రిజ్వి వీఆర్ఎస్ ను రద్దుచేయాలని కూడా కోరారు. ఇపుడీ విషయం ప్రభుత్వంలో సంచలనంగా మారింది. ఇపుడు వ్యవహారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముందుకు వచ్చింది. ఈరోజు క్యాబినెట్ సమావేశం కూడా ఉన్నందున విషయంపై రేవంత్ ఏమి నిర్ణయం వస్తుందో చూడాలి.

రిజ్విగురించి

ఐఐటి కాన్పూరులో రిజ్వి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అలాగే ఐఐఎం అహ్మదాబాదులో మార్కెటింగ్ అంట్ పబ్లిక్ పాలసీ చదివారు. 1999వ బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. పాడేరు ఐటీడీఏ పీవోగా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, నల్గొండ కలెక్టర్ గా, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా, ట్రాన్స్ కో సీఎండీగా, జెన్ కో ఎండీగా, ఇంధనశాఖ కార్యదర్శిగా వివిధ శాఖల్లో పనిచేశారు. డిప్యుటేషన్ పై కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్ లో డైరెక్టురుగా కూడా పనిచేశారు. ఐఏఎస్ అధికారిగా 26 ఏళ్ళ సర్వీసు పూర్తిచేసుకున్న రిజ్వికి మరో పదేళ్ళు సర్వీసుంది. అయితే వ్యక్తిగత కారణాలతో వీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు తెలిసింది. వీఆర్ఎస్ ఆమోదం పొందిన తర్వాత శాఖాపరమైన వివాదం బయటపడటంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read More
Next Story