
పంచాయితి రిజర్వేషన్లలో ఇంత గందరగోళమా ?
అధికారులు అనుసరించిన రిజర్వేషన్ల విధానంతో అన్నీ పార్టీల్లోను అసంతృప్తి పెరిగిపోతోంది
ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం మంగలితండాలో 829 మంది ఓటర్లున్నారు. వీరిలో 827 మంది ఎస్టీలే. పంచాయితి రిజర్వేషన్లలో ఈపంచాయితీ బీసీలకు రిజర్వయ్యింది. జనాభా ఆధారంగా తీసుకుంటే ఈ పంచాయితీ ఎస్టీలకు రిజర్వు అవ్వాలి. కాని బీసీ మహిళకు రిజర్వ్ చేయటంతో ఎస్టీలకు షాక్ కొట్టినట్లయ్యింది. తండా మొత్తంమీద సైదులు, అనిత దంపతులు మాత్రమే బీసీలు. పంచాయితి బీసీలకు రాజర్వు అవటంతో అనిత సర్పంచ్ అయిపోయినట్లే. జనాభా ఆధారంగా రిజర్వేషన్ రద్దుచేసి ఎస్టీలకు కేటాయించాలని ఎస్టీలు డిమాండ్ చేస్తున్నారు.
సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలోని ఉప్పలచాలక గ్రామపంచాయితి సర్పంచ్ పదవితో పాటు నాలుగు వార్డు పదవులు ఎస్టీకి రిజర్వయ్యాయి. పంచాయితి మొత్తంమీద ఎస్టీ కుటుంబం ఒకటే ఉంది. ఆకుటుంబంలోని ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి మిగిలిన రుద్రజారాణి సర్పంచ్ అయిపోయినట్లే. మరి మిగిలిన 4 వార్డు పదవుల పరిస్ధితి ఏమిటి ? పోటీచేయటానికి ఎస్టీలే లేరు కాబట్టి వార్డుపదవులు ఖాళీగా ఉండిపోవాల్సిందేనా ?
వైరా నియోజకవర్గం, ఏన్కూరు మండలంలోని నూకాలంపాడు పంచాయితీ ఎస్టీలకు కేటాయించారు. సర్పంచ్ పదవితో పాటు నాలుగు వార్డుపదవులూ ఎస్టీలకే రిజర్వయ్యాయి. అయితే విచిత్రం ఏమిటంటే ఈ పంచాయితి మొత్తంమీద ఒక్క ఎస్టీ కూడా లేరు. కాబట్టి సర్పంచ్, వార్డుపదవులు ఖాళీగా ఉంచాల్సిందే. ఇదే విధంగా నల్గొండజిల్లా దామచర్లమండలంలోని తూర్పుతండా, జైత్రాతండ, నూనావత్ తండా, బాండావత్ తండా, గోన్యాతండా, మాన్ తండా, బాలాజీనగర్ పంచాయితీల్లోని సర్పంచ్ పదవులను బీసీలకు రిజర్వ్ చేశారు. అయితే పైనచెప్పిన ఏడు పంచాయితీల్లో నూరుశాతం ఎస్టీలే. పైపంచాయితీల్లో ఒక్కటంటే ఒక్క బీసీ కుటుంబం కూడా లేదు. ఏడుపంచాయితీల్లో నామినేషన్లు వేసేవారు లేరుకాబట్టి సర్పంచ్ పదవులన్నీ ఖాళీగానే ఉండాలి.
పైన చెప్పిన ఉదాహరణలు కొన్నిమాత్రమే. ఇలాంటి చిత్రవిచిత్రాలు ఒక్క నియోజకవర్గానికో లేకపోతే ఒక జిల్లాకు మాత్రమే పరిమితంకాలేదు. మొత్తం 119 నియోజకవర్గాల్లోను ఇలాంటి విచిత్రాలు చాలానే ఉన్నాయి. బీసీ జనాభానే లేని పంచాయితీల సర్పంచ్ పదవులను బీసీలకు, ఎస్టీ జనాభానేలేని పంచాయితీలను ఎస్టీలకు, ఒక్క ఎస్సీకూడా లేని పంచాయితీని ఎస్సీలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారుచేశారు.
అందుకనే స్ధానికసంస్ధల ఎన్నికల్లో అధికారులు అనుసరించిన రిజర్వేషన్ల విధానంతో అన్నీ పార్టీల్లోను అసంతృప్తి పెరిగిపోతోంది. తొందరలో జరగబోతున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీట్లరిజర్వేషన్లను అధికారులు ఫైనల్ చేశారు. ఫైనల్ చేయటంలో అధికారులు అనుసరించిన విధానాలే పార్టీల్లో అసంతృప్తిని పెంచేస్తున్నది. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్, రాసిమెట్ల గ్రామాల్లో నూరుశాతం ఎస్టీలే ఉన్నారు. కాని రిజర్వేషన్లలో రెండు పంచాయితీలు బీసీ మహిళలకు రిజర్వయ్యాయి. బీసీలే లేని పంచాయితీలను బీసీలకు అధికారులు రిజర్వ్ చేస్తే నామినేషన్లు ఎవరేయాలి ? ఎన్నికలు ఎలాగ జరుగుతాయి ? ఇలాంటి గొడవలు ఎక్కువగా సర్పంచ్ పదవుల రిజర్వేఫన్లలోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. సుమారు 200 పంచాయితీల్లో ఇలాంటి గందరగోళం ఉన్నట్లు సమాచారం. ఎంపీటీసీ, జడ్పీటీసీల రిజర్వేషన్లలో కూడా ఇలాంటి సమస్యలు కనబడతున్నా అవి చాలా తక్కువనే చెప్పాలి.
అసలు ఇలాంటి గందరగోళం తలెత్తటానికి కారణాలు ఏమిటి ? ఏమిటంటే సర్పంచ్ ఎన్నికలకు 2018 రిజర్వేషన్లను, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం 2011 జనాభా లెక్కలను, బీసీల రిజర్వేషన్ల కోసం 2024 కులగణన లెక్కలను పంచాయితి రాజ్ శాఖ అధికారులు ప్రాతిపదికగా తీసుకోవటమే. అసంబద్దంగా సిద్ధమైన రిజర్వేషన్లపై అన్నీ పార్టీల నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఒకసారి రిజర్వేషన్లను ప్రకటించేసిన తర్వాత మార్చేందుకు లేదని ఇపుడు అధికారులు చెబుతున్నారు. నిజానికి తాజా గందరగోళానికి అధికారులను కూడా పూర్తిగా తప్పుపట్టేందుకు లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ జరగలేదు. 2011లో చేసిన జనాభా లెక్కల సేకరణే చివరి సేకరణ. అందుకనే పైనుండి వచ్చిన ఆదేశాల కారణంగా పంచాయితీ అధికారులు రిజర్వేషన్లన ఖరారులో 2018, 2011, 2024 లెక్కలను ప్రాతిపదికగా తీసుకున్నారు. అందుకనే రిజర్వేషన్ల ప్రక్రియ ఇంత గందరగోళంగా తయారైంది.
గ్రామస్ధాయిలో పట్టుపెంచుకునేందుకు పార్టీలనేతలు బాగా ఇంట్రస్టుచూపిస్తారు. అందుకుతగ్గట్లే ఎన్నికల్లో పోటీచేసేందుకు అన్నీపార్టీల నేతలు చాలాకాలంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తీరా పంచాయితిరాజ్ అధికారులు నిర్వహించిన రిజర్వేషన్ల విధానం చూసిన తర్వాత చాలామంది నేతలు మండిపోతున్నారు.
ఇదేవిషయమై పంచాయితీరాజ్ చాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘రిజర్వేషన్ల ఖరారులో చాలా లోపాలున్న’’ట్లు అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘పోయినఎన్నికల్లో పంచాయితీలకు రిజర్వయిన కులాలను ఇపుడు రొటేషన్ పద్దతిలో అధికారులు మార్చిన’’ట్లు చెప్పారు. అయితే రిజర్వేషన్ల ఖరారులో లోపాలన్నీ ఇపుడు బయటపడినట్లు మండిపడ్డారు. ‘‘బీసీలే లేని పంచాయితీలను బీసీలకు, ఎస్టీలే లేని పంచాయితీలను ఎస్టీలకు కేటాయిచటంలో అర్ధంలేద’’న్నారు. ‘‘కొన్ని పంచాయితీల్లో ఒకే ఒక ఎస్సీ కుటుంబం ఉండగా సదరు పంచాయితీని ఎస్సీలకు కేటాయించి’’న వైనాన్ని వివరించారు. ‘‘అసంబంద్ధంగా ఉన్న రిజర్వేషన్లను మార్చాలని తాము ఎలక్షన్ కమీషనర్ రాణికుముదినిని అడిగినా ఉపయోగంలేకపోయింద’’ని తెలిపారు. ‘‘8వ తేదీన బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు తీర్పును చూసిన తర్వాత చాంబర్ తరపున ఏమిచేయాలో ఆలోచిస్తామ’’న్నారు. ‘‘ఒకసారి రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించేసిన తర్వాత మార్పు కష్టమే’’ అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తంచేశారు. దాదాపు 200 పంచాయితీల్లో కులంతో సంబంధంలేకుండా పంచాయితీలను అధికారులు రిజర్వ్ చేసినట్లు సత్యనారాయణరెడ్డి చెప్పారు.