కన్ఫ్యూషన్ పోయింది.. క్లారిటీ వస్తుందా?
x

కన్ఫ్యూషన్ పోయింది.. క్లారిటీ వస్తుందా?

చదవాలా వద్దా.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలా.. ఉండాలా.. కొన్ని నెలల నుంచి తీవ్ర నిరాశలో ఉన్న నిరుద్యోగులు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో కాస్త సంతోషంతో ఉన్నారు


పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు, మిగిలిన ప్రాసెస్ మొదలుపెట్టడానికి అనుమతి ఇవ్వడంతో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ టెస్ట్ లకు పోలీస్ బోర్డు సమాయత్తం అవుతోంది.

మరో వైపు గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఓ క్లారిటీ వచ్చిందని, ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై కమిషన్ కు స్ఫష్టమైన ఆదేశాలు అందుతాయని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించేలా చేశాయని చెప్పవచ్చు.

2022 డిసెంబర్ లో ప్రకటించిన గ్రూప్ 2 నోటిఫికేన్, 2023 జనవరిలో వెలువడిన గ్రూప్ 3 నోటిఫికేషన్ ఈ రెండింటికీ కూడా పరీక్ష తేదీలను కమిషన్ ప్రకటించలేదు. ఈ లోపు పరీక్ష పేపర్ల లీక్ సంఘటన బయటపడడంతో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. ఏకంగా 14 పేపర్లు లీక్ అయినట్లు తెలియడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పది సంవత్సరాల తరువాత 500 లకు పైగా పోస్టులతో ప్రకటించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ సైతం లీక్ కావడంతో ప్రభుత్వం పరీక్షలన్నీ రద్దు చేసి కొత్త తేదీలను ప్రకటించింది. అయితే రెండో సారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు సరైన పద్ధతులు పాటించలేదనే కారణంతో రద్దు చేసింది. తరువాత కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరిణామాలన్నీ చదువుకున్న యువతలో ఆగ్రహావేశాలు రగిల్చింది.

కొత్త ప్రభుత్వం రావడంతోనే ముందుగా టీఎస్ఫీఎస్పీ ప్రక్షాళన మొదలు పెట్టింది. అయితే అంతకుముందుగానే టీఎస్పీఎస్సీ చైర్మన్, ముగ్గురు సభ్యులు తమ రాజీనామాలను పంపారు. వాటిని గవర్నర్ ఆమోదించడంతో కొత్త బోర్డు కోసం నియామక ప్రక్రియ ప్రారంభం అయింది. చైర్మన్ నియామకం కోసం కొత్తగా దరఖాస్తులు ఆహ్వనించి, మాజీ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి ని చైర్మన్ గా నియమించింది.

అదనపు పోస్టులు.. న్యాయవివాదాలు లేకుండా..

ప్రస్తుతం గ్రూప్ 1 కోసం అదనంగా మరో 70 పోస్టులతో రీనోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం?. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులను కూడా భారీగా పెంచి కొత్త ఉద్యోగ ప్రకటన ఇవ్వాలని ఆలోచిస్తుంది. దీనిలో ఎలాంటి న్యాయవివాదాలు రాకుండా చూడాలని పకడ్భందీగా ముందుస్తు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.

ఉద్యోగాలకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనగామ జిల్లాకు చెందిన ఎన్ నరేష్ కోరుతున్నారు. " నేను అశోక్ నగర్ వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయింది. ఎన్నో ఆశలతో రాసిన గ్రూప్- 1 పరీక్ష రెండు సార్లు రద్దు అయింది. కనీసం గ్రూప్ -2 పరీక్ష రాసి ఉద్యోగం సాధిద్దాం అనుకున్నా. కానీ పరీక్ష తేదీలను మార్చి నా ఆశలపై నీళ్లు చల్లారు. లోక్ సభ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. ఆ లోపే గ్రూప్స్ నోటిఫికేషన్ ఇవ్వాలి. కనీసం ఆశతో నైన పరీక్షపై దృష్టి పెడతాం. ఇప్పుడు నోటిఫికేషన్ రాకపోతే ఇక మళ్లీ జూన్ లోనే. ఇంకో నాలుగు నెలలు వేచి చూడాలంటేనే ఏదోలా ఉంది. నిరీక్షణకు కూడా ఓ హద్దు ఉంటుంది కదా " అని తన ఆవేదనను ఫెడరల్ తో పంచుకున్నారు.

లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తం కావడానికంటే ముందే నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అలాగే మహిళలకు సమాంతర రిజర్వేషన్ పై కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, ప్రభుత్వం కమిషన్ ను ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వారంలోనే ఇంతకుముందు కమిషన్ నిర్వహించిన గ్రూప్-4 తో పాటు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, గురుకులాలు, పీఈటీ సహ ఇతర పరీక్ష ఫలితాలు విడుదల చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వం, టీఎస్సీపీఎస్సీని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై కమిషన్ ఇప్పటికే దృష్టి పెట్టినట్లు సమాచారం

హుజూరాబాద్ కు చెందిన కావ్య(పేరు మార్చాం) మాట్లాడుతూ.. " నాదీ ఇంజనీరింగ్ అయిపోయింది. ప్రస్తుతం పోటీ పరీక్షలకు చదువుతున్నా.. ప్రభుత్వం నోటిఫికేషన్ లు ఇస్తామని చెబుతోంది. అయితే గ్రూప్ -1 నోటిఫికేషన్ కేసు సుప్రీంకోర్టులో ఉంది. దాని పరిస్థితి ఏమిటీ? 2024 లోక్ సభ ఎన్నికలకు ఇంకో రెండు, మూడు వారాల గడువు మాత్రమే ఉంది. ఈ రోజు మంత్రి వర్గం సమావేశం అయి నిర్ణయం తీసుకుంటే.. ఈ లోపు జరిగాల్సిన ప్రక్రియ జరుగుతుందా? నోటిఫికేషన్లు, ఫలితాలు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రావడాకి కంటే ముందే టీఎస్పీఎస్సీ ఇవ్వగలుగుతుందా?" అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.

" అశోక్ నగర్ లో పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. అప్పటిలా పూర్తిగా సందడి లేకున్నా, ప్రభుత్వ నిర్ణయాల వేగం చూస్తుంటే త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు రావచ్చని అనుకుంటున్నాం" అని ఓ పోటీ పరీక్షల కోచింగ్ సంస్థలో పని చేస్తున్న దివ్య( పేరు మార్చాం) అనే రిసెప్షనిస్ట్ ఫెడరల్ కు చెప్పారు. " మేము గత ఏడాది ఓ బిల్డింగ్ ను అద్దెకు తీసుకున్నాం.

అయితే నోటిఫికేషన్ లపై అయోమయం నెలకొనడంతో దాన్ని ఖాళీ చేశాం. అయితే టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ రావడం, ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండడంతో ఈ నెలలోనే కోచింగ్ ఇన్ట్యూట్ కోసం మరో బిల్డింగ్ అద్దెకు తీసుకున్నాం" అని ఆమె చెప్పారు.

ఇదే అంశంపై నిరుద్యోగులు జేఏసీ అధ్యక్షుడు సంగి తిరుపతి ఫెడరల్ తో మాట్లాడుతూ " ప్రభుత్వం ఇప్పటికైనా ఓ నిర్ణయానికి రావడం సంతోషం. దాదాపు రెండు సంవత్సరాల నుంచి నిరుద్యోగులు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. పాత పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించి, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలి. అలాగే టీఎస్పీపీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

Read More
Next Story