
Congress | తమ్ముడి మంత్రి పదవిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాట్ కామెంట్స్
మంత్రి పదవుల విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అంశం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాను పదవుల కోసం పనిచేయనని, ప్రజల కోసం పనిచేస్తానని రాజ్‌గోపాల్ అన్నారు. కాగా ఇప్పుడు తన తమ్ముడికి మంత్రి పదవి అన్న అంశంపై అన్న వెంకట్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అసలు తన తమ్ముడికి మంత్రి పదవి ఇస్తానని పార్టీ పెద్దలు హామీ ఇచ్చిన సంగతి తనకు ఇప్పటి వరకు తెలియదన్నారు. అదే విధంగా తన తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజీలో లేనని, ఇప్పించే పరిస్థితి కూడా లేదని తెలిపారు. ప్రస్తుతం వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
తుది నిర్ణయం వారిదే
‘‘మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి అన్న విషయంపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయంలో రాష్ట్ర పార్టీ సిఫార్సు చేసిన నేతలపై సీఎంతో చర్చించిన తర్వాత ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది ఖరారు చేస్తుంది. మంత్రివర్గంలో నేను సీనియర్ అయినప్పటికీ పార్టీ హైకమాండ్ నిర్ణయమే కీలకం. మంత్రి పదవికి ఎవరెవరి పేర్లు ఇవ్వాలి అన్న అంశంపై సీఎం, టీపీసీసీ చీఫ్ కలిసి నిర్ణయం తీసుకుంటారు. నేను ప్రస్తుతం మంత్రి ఇచ్చే, ఇప్పించే పరిస్థితిలో లేను. అంతా కూడా హైకమాండ్, రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది. ఈ విషయంలో నేనే కాదు ఎవరూ జోక్యం చేసుకోలేరు’’ అని స్పష్టం చేశారు.
రాజ్‌గోపాల్ రెడ్డి ఏమన్నారంటే..
‘‘ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే నాకూ మంత్రి పదవి వచ్చేది. కానీ మునుగోడు ప్రజల కోసం మంత్రి పదవిని వదులుకున్నా. నేను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించినప్పుడు అదే హామీ ఇచ్చారు. మంత్రి పదవి ఇస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజలు భావించారు. పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించడం నాకు చేతకాదు. అది నా వ్యక్తిత్వం కూడా కాదు. రాజగోపాల్ రెడ్డికి పదవులకన్నా ప్రజలే ముఖ్యం. నాకు మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా? అనేది మీ ఇష్టం. నేను ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తా. ఎవరి కాళ్లో మొక్కి పదవి తెచ్చుకోవాలని నేను అనుకోవట్లేదు. దిగజారి బతకడం నాకు తెలీదు. అవసరమైతే మళ్ళీ త్యాగం చేయడానికైనా రెడీ. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తా. నా నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని నేను ఎప్పుడూ చేయను’’ అని అన్నారు.