కాంగ్రెస్కు స్వార్థం తెలీదు: రేవంత్ రెడ్డి
దేశంలో 140 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
దేశంలో 140 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ ప్రసంగించారు. ఈ 140 ఏళ్లలో ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ స్వార్థంగా ఆలోచించలేదని, నిద్రలో సైతం ప్రజల సంక్షేమం గురించే కాంగ్రెస్ కలలు కన్నదని అన్నారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని, ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులు, మైనార్టీల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం కూడా పాటుపడిందని చెప్పారు.
‘‘140 ఏళ్లు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలతో పాటు బీజేపీ సైతం పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నాయి. బీజేపీ ఆర్థిక స్థితి, నిన్న మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏవిధంగా ఉన్నాయో ఓసారి చూడండి. 140 ఏళ్ల కాంగ్రెస్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూడండి. దేశ భవిష్యత్తు కోసం ఇకపై ఈ కార్యాలయం నుంచే ప్రణాళికలు రచించబోతున్నాం. రాబోయే రోజుల్లో పేద ప్రజలందరికీ ఇక్కడి నుంచే దిశ దశ నిర్దేశిస్తాం. ప్రపంచంలోనే మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా విధి విధానాలు రూపొందిస్తాం. దేశ ప్రజలకు ఇది పండుగ రోజు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ ఈరోజు అద్భుతమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. దేశ ప్రజల ప్రయోజనానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక వేదిక కాబోతుంది’’ అని తెలిపారు.
అపాయింట్మెంట్ కోసం ఆపసోపాలు
ఈ క్రమంలో తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. వారి అపాయింట్మెంట్ లభించిన వెంటనే వారితో తెలంగాణకు రావాల్సిన నిధులు, కావాల్సిన ఆర్థిక సహాయం గురించి చర్చిస్తానని అన్నారు. తెలంగాణలో అనేక అంశాలపై కేంద్ర దృష్టిసారించాల్సి ఉందని, వాటిని మరోమారు కేంద్ర దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వీలయితే ప్రధాని మోదీతో కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.