తెలంగాణకు కాంగ్రెస్, బిజెపిలు శత్రువులే
x

తెలంగాణకు కాంగ్రెస్, బిజెపిలు శత్రువులే

మాజీ మంత్రి హరీష్ రావ్ ఫైర్


స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి టి. హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలే కేంద్రానికి ప్రాధాన్యమని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. . నల్లధనం తెచ్చి ఇస్తానన్న హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, పేదలందరికీ ఇళ్లు, బుల్లెట్ రైళ్లు వంటి హామీలు నీట మూటలయ్యాయి అని హరీశ్‌రావు అన్నారు.

చారానా తగ్గించి బారానా పెంచి

రూ.350 ఉన్న సిలిండర్‌ను అమాంతం రూ.1,200కు పెంచేసిందన్నారు. రూ.65 ఉన్న పెట్రోల్‌ను రూ.100లు మోదీ ప్రభుత్వం పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందన్నారు. 2017 నుంచి కొత్తగా జీఎస్టీ తెచ్చి అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు. ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికలు అయిపోగానే బారానా పెంచుతూ ప్రజలను మభ్యపెడుతుందని ధ్వజమెత్తారు. తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని అన్నారు. బూటకపు హామిలతో అధికారంలో వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనను నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో యూరియా కొరత లేకుండానే రైతులు సంతోషంతో జీవించారన్నారు. యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యిందని నిలదీశారు. తెలంగాణ రైతులంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకి లెక్కలేదని హరీశ్‌రావు అన్నారు.

చోటా భాయ్, బడే భాయ్ తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో ఆరి తేరిపోయారన్నారు. మోదీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకటేనన్నారు. కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు దొందూ దొందేనని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులేనన్నారు. తెలంగాణ పాలిట శకునిలేనని ఎద్దేవా చేశారు. ఆదివారం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చిన తెలంగాణ పట్ల బిజెపికి చిత్తశుద్ది లేదన్నారు.

Read More
Next Story