కాంగ్రెస్-బీజేపీలు కేసీఆర్ ను ఆడుకుంటున్నాయా ?
x
Revanth KCR and Bandi

కాంగ్రెస్-బీజేపీలు కేసీఆర్ ను ఆడుకుంటున్నాయా ?

ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో ఒక్కటంటే పార్టీ ఒక్కటి సీటులో కూడా గెలవకపోవటంతో కేసీఆర్ నాయకత్వంపై నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.


బీఆర్ఎస్ పరిస్ధితి రోజురోజుకు దిగజారిపోతోంది. కాంగ్రెస్, బీజేపీలు చెరోవైపు కారుపార్టీని ఒక ఆటాడుకుంటున్నాయి. విషయం ఏమిటంటే తొందరలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోవటం ఖాయమని కేంద్రమంత్రి బండి సంజయ్ జోస్యంచెప్పారు. చాలాకాలంగా ఇదే విషయాన్ని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతు తొందరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవటం ఖాయమన్నారు. కేసీఆర్ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గాను, కేటీఆర్ కేంద్రమంత్రి అవుతారని జోస్యం కూడా చెప్పారు. హరీష్ రావు అసెంబ్లీలో బీఆర్ఎస్(బీజేపీ) పక్షనేత అవుతారని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కు ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం అయిపోయిన తర్వాత కల్వకుంట్ల కవిత బీజేపీ తరపున రాజ్యసభ ఎంపీ అవుతారని చెప్పారు.

బండి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమైన తర్వాత కేసీఆర్ కు ఏఐసీసీలో కీలకమైన పదవి దక్కుతుందన్నారు. కేటీఆర్ పీసీసీ అధ్యక్షుడవుతారని, కవితను కాంగ్రెస్ రాజ్యసభకు పంపుతుందని చెప్పారు. పొత్తులు, విలీనాల విషయంలో కేసీఆర్ ఆలోచనలు ఎలాగున్నాయో బయటకు తెలీకపోయినా బీజేపీ, కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ మీతోనే కలిసిపోతుందని..కాదు కాదు మీపార్టీలో విలీనమైపోతుందని బహిరంగంగా చెప్పుకోవటం ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ గురించి కాంగ్రెస్, బీజేపీలు ఇంత తక్కువగా మాట్లాడుకోవటానికి కారణం ఏమిటి ? ఏమిటటే ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్ధితనే చెప్పాలి. ఆమధ్య అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కారుపార్టీని సమస్యలు కమ్ముకుంటున్నాయి. దానికితోడు కేసీఆర్ వ్యవహార శైలి కూడా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు అనిపించటంలేదు.

ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో ఒక్కటంటే పార్టీ ఒక్కటి సీటులో కూడా గెలవకపోవటంతో కేసీఆర్ నాయకత్వంపై నేతలు, క్యాడర్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కాంగ్రెస్ లో జాయిన అవుతుంటే ద్వితీయ శ్రేణి నేతలు బీజేపీలోకి వెళిపోతున్నారు. దాంతో బీఆర్ఎస్ బాగా బలహీనపడిపోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే సమయంలో కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన రెండుకమిషన్లు విచారణ చేస్తున్నాయి. వాటి రిపోర్టులు ప్రభుత్వానికి అందిన తర్వాత ఏమి జరుగుతుందో చూడాలి.

ఈలోగా బీఆర్ఎస్ విలీనం ఖాయమంటు కాంగ్రెస్, బీజేపీల నుండి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిపోతోంది. పార్టీలో కేసీఆర్ యాక్టివ్ గా లేకపోవటం, కేటీఆర్, హరీష్ కేవలం మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమవ్వటం కూడా కారుపార్టీ నేతలు, క్యాడర్లో అనేక అనుమానాలను పెంచేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఐడుమాసాలుగా ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కూతురు కవితను బయటకు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ను కేసీఆర్ బీజేపీలో విలీనం చేసేస్తారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని జనాలు కూడా నమ్ముతున్నట్లే ఉన్నారు. ఎందుకంటే ఒకపుడు నరేంద్రమోడిపై నోటికొచ్చినట్లు విరుచుకుపడిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఇపుడు నోరిప్పటంలేదు. ఇందుకనే కేసీఆర్ వ్యవహార శైలిపై జనాల్లో కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story