తెలంగాణకి ఎలివేటెడ్ కారిడార్లు.. అసలు ప్రయోజనం ఎవరికి?
తెలంగాణలో ఎలివేటెడ్ కారిడార్లకు కేంద్రం ఆమోదం. మావల్ల అంటే మా వల్లే అంటున్న అధికార ప్రతిపక్షాలు పార్టీలు
వనజ మోర్ల
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. వేసవి ఎండలతో సమానంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా తమకి అనుకూలంగా మార్చుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం.. ఇది మావల్లే అంటే మావల్లే అని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఓన్ చేసుకునే ప్రయత్నం ప్రారంభించాయి. ఈ అంశం హైదరాబాద్ లోని కంటోన్మెంట్ పరిధిలో ఓట్లు కురిపించే ఆయుధం కావడంతో ఇరు పార్టీలు క్రెడిట్స్ తీసుకునే ప్రయత్నంలో పడ్డాయి.
ఇటీవల కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ స్థానానికి జరిగే ఉపఎన్నిక షెడ్యూల్ కూడా పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉండవచ్చు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని గులాబీ పార్టీ, మహానగరంలో మరో సీటు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. అందులో భాగంగా ఎలివేటర్ కారిడార్ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా పరిష్కారం లేకుండా పడిఉన్న రవాణా సమస్యని ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు నెలల్లోనే క్లియర్ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ఇది మా ఎనిమిదేళ్ళ పోరాటానికి ప్రతిఫలం, కానీ ఫలాలు మీరు తింటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. ఇంతకీ ఈ ఎలివేటర్ కారిడార్లు అంటే ఏంటి? తెలంగాణకి దీంతో ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? దీనికోసం కాంగ్రెస్ కొత్తగా చేసిందేంటి? గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిన్న (మార్చి 1, 2024) తెలంగాణ సీఎంవో X వేదికగా ఒక ప్రకటన చేసింది. "ఎలివేటేడ్ కారిడార్లకు కేంద్రం అనుమతి. హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన కేంద్ర రక్షణ శాఖ. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి ఈరోజు ఉదయం అనుమతులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటంతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. హైదరాబాద్ నుంచి శామీర్‌పేట, హైదరాబాద్ నుంచి మేడ్చల్ దిశగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి" అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఎలివేటెడ్ కారిడార్ల గురించి తెలంగాణలో రాజకీయ చర్చ మొదలైంది.
ఎలివేటెడ్ కారిడార్లు అంటే...
ఎలివేటెడ్ కారిడార్‌లు అనగానే కొత్త పదంలా అనిపిస్తుంది. కానీ సింపుల్ గా సామాన్యుల భాషలో చెప్పాలంటే నేల మట్టం నుంచి కొంచెం ఎత్తులో నిర్మించే బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు, రోడ్‌వేలు అనొచ్చు. ఇవి ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో వాహనదారులకు, పాదచారులకు ఇప్పటికే ఉన్న రోడ్‌వేలు, నడక మార్గాల కంటే అదనపు మార్గాన్ని అందించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపయోగించబడతాయి. ఎలివేటెడ్ కారిడార్‌లను ఎలివేటెడ్ రైల్వేలు లేదా మోనోరైళ్లు వంటి ప్రజా రవాణా వ్యవస్థలకు కూడా ఉపయోగించవచ్చు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రవాణా సామర్థ్యం, కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఇవి నిర్మిస్తారు. అయితే కంటోన్మెంట్ లో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీంతో వాహనదారులు రాకపోకలకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యని తీసుకెళ్లినప్పటికీ.. ఆ ఏరియా డిఫెన్స్ ఆధీనంలో ఉండటంతో ట్రాఫిక్ సమస్యని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచారు కూడా. కానీ, కంటోన్మెంట్ ట్రాఫిక్ సమస్య మాత్రం తీరలేదు. అయితే CM అయిన 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి సమస్యను పరిష్కరించారని, డిఫెన్స్ భూముల మీదుగా రవాణా మార్గాలు సుగమం చేయనున్నారని చెబుతున్నారు.
ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం..
కేంద్రం ఇచ్చిన అనుమతితో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, రామగుండం జిల్లాల్లో రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. సికింద్రాబాద్ ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది. హైదరాబాద్ నుండి శామీర్‌పేట వరకు మరియు హైదరాబాద్ నుండి కండ్లకోయ వరకు ఎలివేటెడ్ కారిడార్‌ల అభివృద్ధి వలన నార్త్ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. రక్షణ భూములు మంజూరు చేయడంతో జాతీయ రహదారుల విస్తరణకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు మావల్లే :కాంగ్రెస్
సీఎం రేవంత్ రెడ్డి జనవరి 5న ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై రక్షణ భూముల్లో ఎలివేటెడ్ కారిడార్ల అభివృద్ధికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ను కలుపుతూ కరీంనగర్-రామగుండం రాజీవ్ రహదారిపై ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, మొత్తంగా ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి 83 ఎకరాల భూమిని కేటాయించాలని రక్షణ మంత్రిని సీఎం కోరారు. 11.30 కి.మీ కారిడార్ నిర్మాణం, కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుండి నాగ్‌పూర్ హైవే (NH-44)లోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు మొత్తం 18.30 కిలోమీటర్ల పొడవునా కారిడార్ల నిర్మాణం కోసం 56 ఎకరాల రక్షణ భూములను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రక్షణ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
దీనిపై సానుకూలంగా స్పందించి కేంద్ర రక్షణ శాఖ 175 ఎకరాల రక్షణ శాఖ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసిందని కాంగ్రెస్ చెబుతోంది. "గత ప్రభుత్వం అవలంభించిన దురహంకార వైఖరితో ఏళ్ల తరబడి ఎలివేటెడ్ కారిడార్‌ల అభివృద్ధి నిలిచిపోయింది. గత 8 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను కొత్త ప్రభుత్వం కేవలం 80 రోజుల్లోనే అనుమతులు పొంది రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రదర్శించిందని" సీఎం రేవంత్ అన్నారు.
మేము చేసిన కృషి వల్లే ఎలివేటెడ్ కారిడార్లకి పర్మిషన్ :BRS
గత ప్రభుత్వం సాధించలేని ఘనత అతి తక్కువ టైం లో మేము సాధించామని కాంగ్రెస్ సర్కార్ చెబుతుండగా.. మా కష్టానికి వచ్చిన ఫలాలు మీరు తింటున్నారని గులాబీ శ్రేణులు తిప్పికొట్టే పనిలో పడ్డాయి. సికింద్రాబాద్ పరిధిలో ట్రాఫిక్ తగ్గించేందుకు ఎనిమిదేళ్ళ పాటు కేసీఆర్, కేటీఆర్ కేంద్రంతో చేసిన పోరాట ఫలితమే నేడు వచ్చిన అనుమతులు అంటూ బలంగా చెబుతున్నారు. అసలు, పర్మిషన్ మా హయాంలోనే వచ్చింది, ఇదిగో సాక్ష్యం అంటూ ఓ లెటర్ ని సోషల్ మీడియాలో పెట్టారు. (సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్ కింద ఉంది చూడవచ్చు).
Next Story