కేటీఆర్ ‘ఆడబిడ్డ’ సెంటిమెంట్ రివర్సు కొడుతోందా ?
x
KTR and Maganti Sunitha

కేటీఆర్ ‘ఆడబిడ్డ’ సెంటిమెంట్ రివర్సు కొడుతోందా ?

రేవంత్ ఆరోపణలకు ఇప్పటివరకు కేటీఆర్ నుండి సమాధానం లేదు.


జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడబిడ్డ సెంటిమెంటును పెంచేస్తున్నాయి. శనివారం రాత్రి జరిగిన ముఖ్యమంత్రి ఎనుముల(Revanth) రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రసంగాల్లో ప్రధానంగా ఆడబిడ్డ సెంటిమెంటే ఎక్కువగా కనబడింది. ఆడబిడ్డను ఓడగొట్టేందుకు గల్లీగల్లీ తిరుగుతున్నరు అంటు రేవంత్, మంత్రులను ఉద్దేశించి కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. మాగంటి గోపీనాధ్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.(Jubilee Hills by poll) ఉపఎన్నికలో గెలవటం కోసం బీఆర్ఎస్ దివంగత ఎంఎల్ఏ భార్య మాగంటి సునీతను అభ్యర్ధిగా పోటీచేయిస్తోంది.

బీఆర్ఎస్ ఉద్దేశ్యం ఏమిటంటే గోపీనాధ్ మరణం తాలూకు సెంటిమెంటుతో ఓట్లుపడి సునీత గెలుస్తుందని. కొన్ని రోడ్డుషోలు, సభలో సునీత కనీళ్ళు పెట్టుకుంటున్నారు. గద్ఘదసర్వంతోనే సునీత ఓట్లు అడిగిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈనేపధ్యంలోనే ఆడబిడ్డను ఓడగొట్టేందుకు గల్లీగల్లీ తిరుగుతున్నరు అంటు కేటీఆర్ సెంటిమెంటును ధట్టించారు.

దీనికి కౌంటరుగా తర్వాత బోరబండ, ఎర్రగడ్డలో రాత్రి జరిగిన రోడ్డుషోలో రేవంత్ మాట్లాడుతు చెల్లికి అన్నంపెట్టనోడు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు చేయిస్తాడా ? అంటు గట్టిగా తగులుకున్నాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సొస్తుందని సొంతచెల్లి కల్వకుంట్ల కవితను ఇంటినుండి తరిమేసిన కేటీఆర్ ఇపుడు సునీతమ్మకు ఓట్లు వేయాలని కోరుకోవటం హాస్యాస్పదమన్నారు. ఏ ఆడబిడ్డ కూడా పుట్టింటిపై ఆరోపణలు చేయదని, కాని ఇఫుడు కవిత కేటీఆర్, కేసీఆర్ ను టార్గెట్ చేయటం అందరికీ తెలిసిందే అన్నారు. తనను ముందు పార్టీలో నుండి తర్వాత ఇంట్లో నుండి తరిమేయటానికి కేటీఆరే కారణమన్న కవిత మాటలను రేవంత్ గుర్తుచేశాడు. రేవంత్ ఆరోపణలకు ఇప్పటివరకు కేటీఆర్ నుండి సమాధానం లేదు.

వీళ్ళిద్దరి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలాగుండగానే కవిత మద్యలో ఎంటరైపోయింది. తన భర్త, కేటీఆర్ కు బావ టెలిఫోన్ నే ట్యాప్ చేయిస్తారా అంటు కవిత మండిపోయింది. తన భర్త ఫోన్ను ట్యాప్ చేయించిన విషయం తెలియగానే కడుపులో దేవినట్లయిపోయిందన్నారు. బీఆర్ఎస్ లో తాను చాలా అవమానాలు పాలైనట్లు ఆవేధన వ్యక్తంచేశారు. అవమానాలను భరించలేకే పార్టీలో నుండి బయటకు వచ్చేసినట్లు కవిత చెప్పారు. పార్టీలో, ఇంట్లో అన్న కేటీఆర్ వల్లే అన్యాయం, అవమానాలు జరిగినట్లు కవిత డైరెక్టుగానే ఆరోపిస్తున్నారు. అటు రేవంత్ ఇటు కవిత ఆరోపణలకు సమాధానాలు చెప్పుకోలేక కేటీఆర్ నానా అవస్తలు పడుతున్నారు. ఆడబిడ్డ అనే సెంటిమెంటును ప్రయోగించి ఓట్లేయించుకుని గెలవాలన్న కేటీఆర్ వ్యూహం రివర్సు కొడుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Read More
Next Story