కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సవాలుగా తయారైన జూబ్లీహిల్స్
x
Revanth and KTR

కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సవాలుగా తయారైన జూబ్లీహిల్స్

పట్టుకోసం బీఆర్ఎస్..గెలుపుకోసం కాంగ్రెస్…రెండుపార్టీల మధ్య జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టామ్ అండ్ జెర్రీ షో లాగ తయారైంది


పట్టుకోసం బీఆర్ఎస్..గెలుపుకోసం కాంగ్రెస్…రెండుపార్టీల మధ్య జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టామ్ అండ్ జెర్రీ షో లాగ తయారైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక రెండు ప్రధాన పార్టీలకు పెద్ద సవాలుగా తయారైంది. పట్టుకోసం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉపఎన్నికలో గెలవాల్సిన పరిస్ధితి. అలాగే ఈఉపఎన్నికలో(Jubilee Hills by poll) గెలిచి జనాలమద్దతు తమకే ఉందని చెప్పుకోవాల్సిన అగత్యం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)కి ఉంది. రెండుపార్టీలపైనా జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది కాబట్టి జనాల మద్దతు తమకే ఉందని చాటిచెప్పేందుకు బీజేపీ(Telangana BJP) కూడా పావులు కదుపుతోంది. అయితే పోటీ ప్రధానంగా కాంగ్రెస్-బీజేపీ మధ్యే జరుగుతుందని ప్రచారం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ తరపున దివంగత ఎంఎల్ఏ మాగంటి గోపీనాధ్(Maganti Gopinath) భార్య మాగంటి సునీత పోటీచేస్తున్నారు. ఈమె కొంతకాలంగా నియోజకవర్గంలో ప్రచారం కూడా చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ తరపున వీ. నవీన్ యాదవ్(Naveen Yadav) అభ్యర్ధిగా దాదాపు ఖాయమైనట్లే అని పార్టీవర్గాల సమాచారం. నవీన్ అభ్యర్ధిత్వం వైపు రేవంత్ మొగ్గుచూపినట్లు తెలిసింది. ఒకటిరెండు రోజుల్లోనే అధిష్ఠానం నవీన్ అభ్యర్ధిగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

ముందుగా నియోజకవర్గం గురించి తెలుసుకుందాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు రహ్మత్ నగర్, బోరబండ, షేక్ పేట, వెంగళరావునగర్, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ ఉన్నాయి. పోయిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో రెండు డివిజన్లను ఎంఐఎం, నాలుగు డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకున్నాయి. ఎన్నికల కమీషన్ ప్రకటించిన తాజా లెక్కలప్రకారం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 3.99 లక్షలు. ఇందులో 2,07,367 మంది పురుషులు కాగా, 1.91, 590 మంది స్త్రీలున్నారు. మొత్తంమీద 407 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమీషన్ ఏర్పాటుచేసింది. 139 ప్రభుత్వ ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్ళల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ప్రతి పోలింగ్ కేంద్రానికి సగటున 980 మంది ఓటర్లను ఎన్నికల కమీషన్ కేటాయించింది.

ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. మొదటి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన పీ. విష్ణువర్ధనరెడ్డి గెలిచాడు. తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా మాగంటి గోపీనాధ్ గెలిచాడు. తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన గోపి 2018, 2023 ఎన్నికల్లో కారుపార్టీ అభ్యర్ధిగా గెలిచి హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకున్నాడు. అయితే గోపి హఠాన్మరణం కారణంగా ఇపుడు ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11న జరగబోయే ఉపఎన్నికలో గెలుపుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ శక్తి, యుక్తులను ప్రదర్శిస్తున్నాయి. బీజేపీ కూడా రేసులో ఉన్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంటుంది. బీఆర్ఎస్ తరపున గోపి భార్య మాగంటి సునీత పోటీచేస్తున్నారు. రాజకీయాలకు కొత్తయినా సునీతను పోటీలోకి దింపటంలో బీఆర్ఎస్ ఉద్దేశ్యం ఏమిటంటే గోపి మరణం తాలూకు సానుభూతి గెలిపిస్తుందని. గోపి సీమాంధ్రకు చెందిన కమ్మసామాజికవర్గం నేత. నియోజకవర్గంలో సీమాంధ్రులు ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం అందులోను సినిమా పరిశ్రమవారి పట్టుఎక్కువ. గోపీ కూడా సినిమా వ్యక్తే కావటంతోనే మూడుసార్లు వరుసగా గెలిచాడు. ఇలాంటి అంశాలు కలిసొచ్చి సునీత ఈజీగా గెలుస్తుందని కారుపార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.

నియోజకవర్గంలోని 3.99 లక్షల ఓటర్లలో ముస్లిం మైనారిటీల ఓట్లు దాదాపు లక్ష ఉన్నాయి. తర్వాత ఎస్సీ, యాదవ, కమ్మ, రెడ్డితో పాటు ఇతర సామాజికవర్గాలున్నాయి. ముస్లిం ఓట్లు గంపగుత్తగా ఎవరికైతే పడతాయో వాళ్ళు గెలుపుకు బాగా దగ్గరగా ఉంటారు. నవీన్ ఒకపుడు ఎంఐఎం నేతే. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరాడు. కాబట్టి ఎంఐఎం మద్దతుతో పాటు ముస్లిం ఓట్లు, సంక్షేమపథకాల లబ్దిదారుల ఓట్లు తనకే పడతాయని నవీన్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ముస్లిం ఓట్లతో పాటు కమ్మ, సీమాంధ్రులు, ముఖ్యంగా సినిపరిశ్రమ ఓట్లు తమకే పడతాయని బీఆర్ఎస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నది. పై రెండుపార్టీల మీద వ్యతిరేకతతో ఉన్న ప్రజలు తమకే ఓట్లేసి గెలిపిస్తారని బీజేపీ ఆశపడుతోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ తరపున వీ. నవీన్ యాదవ్ కు టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగంటే స్ధానిక నేతకే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం స్పష్టంగా చెప్పింది. అందుకనే అభ్యర్ధి ఎంపిక కోసం ఎనుముల రేవంత్ రెడ్డి నియమించిన మంత్రులకమిటి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ అనేకమంది ఆశావహులతో మాట్లాడి, వడపోసి చివరకు ముగ్గురు పేర్లను సిఫారసుచేసింది. వీరిలో నవీన్, బొంతురామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నట్లు సమాచారం. వీరిలో టికెట్ రేసులో నుండి తప్పుకున్నట్లు స్వయంగా బొంతు ప్రకటించారు. మిగిలిన ఇద్దరిలో నవీన్ యాదవ్ స్ధానికుడని పార్టీవర్గాల సమాచారం. అలాగే రేవంత్ కూడా నవీన్ అభ్యర్ధిత్వంపైనే మొగ్గుచూపినట్లు పార్టీవర్గాల సమాచారం. అందుకనే నవీన్ కే టికెట్ ఖాయమనే ప్రచారం బాగా జోరుగా జరుగుతోంది.

నిజానికి ఈ ఉపఎన్నికలో ఏపార్టీ గెలిచినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. బీఆర్ఎస్ గెలిస్తే రేవంత్ ప్రభుత్వం ఏమీ పడిపోదు. అలాగే కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచినంత మాత్రాన బీఆర్ఎస్ కు జరిగే నష్టమేమీలేదు. కాకపోతే సిట్టింగ్ సీటులో ఓడిపోవటం బీఆర్ఎస్ కు నష్టమనే చెప్పాలి. రేవంత్ ప్రభుత్వంపై రాష్ట్రంలోని ప్రజలంతా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ప్రతిరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు తదితరులు ఒకటే ఊదరగొడుతున్నారు. తమ మాట నిజమే అనిపించుకోవాలంటే సునీత కచ్చితంగా గెలవాల్సిందే. ఏ అంశాలు అనుకూలించి సునీత గెలిచినా రేవంత్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్న తమ మాటనిజమే అని ఎన్నికలఫలితం నిరూపించిందని బీఆర్ఎస్ నేతలు కొద్దిరోజులు రెచ్చిపోవటం ఖాయం.

ఇదేసమయంలో కాంగ్రెస్ గెలిస్తే తమ ప్రభుత్వంమీద జనాల్లో ఎలాంటి వ్యతిరేకతలేదని రేవంత్, మంత్రులు, ఎంఎల్ఏలు చెప్పుకుంటారు. కావాలనే తమప్రభుత్వంపై బీఆర్ఎస్ బురదచల్లేస్తోందని రేవంత్ అండ్ కో ఎదురుదాడులు మొదలుపెడతారు. ఉపఎన్నికలో గెలిస్తే గ్రేటర్ హైదరాబాద్ లోని రెండో నియోజకవర్గం కాంగ్రెస్ ఖాతాలో పడినట్లవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ లాస్య నందిత మరణించిన విషయం తెలిసిందే. తర్వాత జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీగణేష్ గెలిచారు. కంటోన్మెంట్ గెలుపుతో గ్రేటర్లో కాంగ్రెస్ బోణి కొట్టినట్లయ్యింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిస్తే కాంగ్రెస్ ఖాతాలో మరో నియోజకవర్గం చేరుతుంది. ఈవిజయం తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరింత జోష్ తో పనిచేయటానికి టానిక్ లాగా పనిచేస్తుంది.

Read More
Next Story