కంటోన్మెంట్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్
x

కంటోన్మెంట్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్

కాంగ్రెస్ హై కమాండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక అభ్యర్థిని ఫిక్స్ చేసింది. నారాయణ్ శ్రీ గణేష్ పేరును ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.


కాంగ్రెస్ హై కమాండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి రిజర్వుడ్) ఉపఎన్నిక అభ్యర్థిని ఫిక్స్ చేసింది. నారాయణన్ శ్రీ గణేష్ పేరును ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే శ్రీ గణేష్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించగా.. నేడు పార్టీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ బిజెపి తరఫున కంటోన్మెంట్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత 17,169 వేల మెజారిటీతో గెలుపొందారు.

లాస్య నందిత అకాల మరణంతో లోక్ సభ ఎన్నికలతోపాటు ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. లాస్య నందిత మరణానంతరం బిజెపిని విడిచి కాంగ్రెస్ లో చేరిన శ్రీ గణేష్ టికెట్ దక్కించుకున్నారు. మరోసారి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక బీఆర్ఎస్ లాస్య నందిత సోదరి నివేదితకి టికెట్ ఇవ్వగా.. బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు.

ఫిబ్రవరి 23న పఠాన్ చెరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్థానానికి మే 13న లోక్ సభ ఎన్నికలతోపాటు ఉపఎన్నిక జరపాలని నిర్ణయించింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన లాస్య నందిత 59,057 సాధించి 17,169 వేల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ తరపున పోటీ చేసిన నారాయణన్ శ్రీ గణేష్ 41,888 ఓట్లతో రెండవ స్థానంలో నిలబడ్డారు. కాంగ్రెస్ తరపున గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేయగా ఆమె 20,825 ఓట్లతో మూడవ స్థానానికి పరిమితమయ్యారు.

2009 లో తప్ప 1994 నుంచి 2018 వరకు సాయన్న కంటోన్మెంట్ లో విజయబావుటా ఎగురవేశారు. 4 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా, ఒకసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో తన హవా కొనసాగించారు. 2022 ఫిబ్రవరిలో ఆయన మరణానంతరం బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందితకి టికెట్ ఇవ్వగా.. ఆమె కూడా విజయం సాధించారు.

2009 లో కంటోన్మెంట్ లో గెలిచిన కాంగ్రెస్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ఆ స్థానంలో సీటు సంపాదించుకోలేదు. గద్దర్ సెంటిమెంట్ తో ఓట్లు పడతాయని భావించి ఆయన కుమార్తె వెన్నెలకి 2023 లో కంటోన్మెంట్ టికెట్ ఇవ్వగా ఫలితాలు నిరాశపరిచాయి. అసలు గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. దీంతో ఉపఎన్నికపైన కన్నేసిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన నారాయణన్ శ్రీ గణేష్ ని బరిలో దింపింది.


Read More
Next Story