
గవర్నర్‌తో కాంగ్రెస్ బీసీ నేతల భేటీ..
రిజర్వేషన్లన్నీ కలిసి 50శాతం మించకూడదు. ఒకవేళ రిజర్వేషన్లు 50శాతాన్ని దాటితో వాటిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 9లో 31(సీ) క్లాస్ ప్రకారం చేర్చాల్సి ఉంటుంది.
తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ఈరోజు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై వారు చర్చించారు. బీసీల రిజర్వేషన్లను పెంచుతున్న బిల్లును గవర్నర్.. రాష్ట్రపతికి పంపినందుకు గానూ వారు ధన్యవాదాలు తెలిపారు. మంత్రిపొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కేకే, మధుయాష్కీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అయితే స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచాలని పేర్కొంటూ మార్చి 18న రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. అనంతరం ఇది గవర్నర్ చెంతకు చేరగా ఆయన ఈ బిల్లును రాష్ట్రపతికి పంపారు. అయితే రిజర్వేషన్ల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల కారణంగానే గవర్నర్.. ఈ బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నింటికీ అందించే రిజర్వేషన్లన్నీ కలిసి 50శాతం మించకూడదు. ఒకవేళ రిజర్వేషన్లు 50శాతాన్ని దాటితో వాటిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 9లో 31(సీ) క్లాస్ ప్రకారం చేర్చాల్సి ఉంటుంది. అందుకే ఈ క్లాస్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. రాష్ట్రపతికి పంపారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 (సి) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్నట్టు బిల్లుల్లో పేర్కొంది. న్యాయ సలహా తీసుకుని రాష్ట్రపతి వాటిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవి చట్టపరంగా నిలబడాలంటే మాత్రం.. బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. అప్పుడు మాత్రమే అవి రాజ్యాంగంలోని షెడ్యూల్-9లో చేరి, వాటికి రాజ్యాంగ రక్షణ లభిస్తుంది.