
‘బీసీ రిజర్వేషన్లకు ఇక అడ్డేముంది’
బీజేపీ, కాంగ్రెస్ మద్దతిచ్చాక బీసీ రిజర్వేషన్లను ఆపేదెవరన్న హరీష్ రావు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా డ్రామాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ మద్దతు ఇచ్చాక వాటిని ఆపేవారు ఎవరున్నారు? అని ప్రశ్నించారు. పార్లమెంటులో బీజేపీకి 240 సీట్లు, కాంగ్రెస్‌కు 99 సీట్లు ఉన్నాయని, వీరిద్దరు అనుకుని బిల్లు పెడితే క్షణాల్లో అది అమలవుతుందని అన్నారు హరీష్ రావు. కానీ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కోట్లాడాల్సిన ఈ రెండు పార్టీల నాయకులు గల్లిల్లో చేరి డ్రామాలు ఆడుతున్నారని చురకలంటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పవర్‌లో ఉందని, ఈ రెండు అనుకుంటే బీసీ రిజర్వేషన్లకు అడ్డేముంటుంది? అని ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా బీసీలకు అవమానిస్తున్నాయి. ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీ గణన చేయలేదు. బిజెపి అయితే ఏకంగా జన గణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నది. గడిచిన 35 ఏళ్ళల్లో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బిజెపి 17 ఏళ్లు పాలిస్తే ఏనాడు ఈ రెండు పార్టీలకు బీసీలు గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నాయి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005 లోనే కోరిన దేశంలోనే ఏకైక నేత కేసీఆర్. రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తిచేశారు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదు. ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదు, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు’’ అని గుర్తు చేశారు.
‘‘జనాభా ఎంత ఉంటే అంత వాటా వారి హక్కు అని నినదించే రాహుల్ గాంధీ.. పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదు? కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గాని ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు? రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారు. పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయి. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బిఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుంది. ఎలాంటి పోరాటానికైనా బిఆర్ఎస్ కలిసి వస్తుంది. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి.. ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలని కాంగ్రెస్, బిజెపి లను డిమాండ్ చేస్తున్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు.