ఆరోపణలకు ప్రజలే బదులిచ్చారు..
x

ఆరోపణలకు ప్రజలే బదులిచ్చారు..

రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపు ధృవీకరణ పత్రం అందుకున్న నవీన్ యాదవ్.


ఉపఎన్నికలో తనపై వచ్చిన ఆరోపణలు, జరిగిన దుష్ప్రచారానికి ప్రజలే బదులు ఇచ్చారని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఎన్నికల ప్రచారంలో తనపై కొందరు తీవ్ర దుష్ప్రచారం చేశారని, రౌడీ షీటర్ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ వాటన్నింటికి కూడా ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పారని సంతోషం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్.. 24,729 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను ఓడించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గెలుపు ధృవీకరణ పత్రాన్ని అందించారు. అది అందుకున్న అనంతరం ఉపఎన్నిక ఫలితాలపై నవీన్ యాదవ్ మాట్లాడారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

“నా విజయానికి కారణమైన కాంగ్రెస్‌ నాయకులు, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, సీనియర్‌ నాయకులు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఓటు చేశారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, అందరం కలసి మా ప్రాంత అభివృద్ధి కోసం పని చేద్దాం. కొన్ని పార్టీలు నాపై అసత్య ప్రచారం చేసి గెలవాలని ప్రయత్నించాయి, కానీ ప్రజలు ఆ దుష్ప్రచారాన్ని తిరస్కరించారు. నా నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తాను” అని చెప్పారు.

ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఫలితాలు ఇలా ఉన్నాయి:

కాంగ్రెస్‌: నవీన్‌ యాదవ్‌ – 98,988 ఓట్లు

భారత రాష్ట్రసమితి: మాగంటి సునీత – 74,259 ఓట్లు

భాజపా: లంకల దీపక్‌ రెడ్డి – 17,061 ఓట్లు

అభివృద్ధికే ఓటు పడింది: మహేష్ కుమార్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజలు ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉంటారని ఈ ఉపఎన్నిక నిరూపించిందన్నారు. ‘‘నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు. ఈ విజయం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అంకితం. జూబ్లీహిల్స్ తీర్పుతో బీఆర్ఎస్‌కు సెలవిచ్చారు ప్రజలు. రాష్ట్రంలో ఆ పార్టీకి చోటు లేదని ఓటుతో చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలతో పాటు బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఛీ కొడుతున్నారని ఈ ఉపఎన్నిక రుజువుచేసింది. రానున్న రోజుల్లో కూడా ప్రజల అవసరాల, ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతుంది. నవీన్‌ను గెలిపించిన ఘనత సీఎం, మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలదే’’ అని మహేష్ కుమార్ వ్యాఖ్యానించారు.

Read More
Next Story