‘అక్కడ గెలవడానికే ఇక్కడ కులగణన’.. రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
x

‘అక్కడ గెలవడానికే ఇక్కడ కులగణన’.. రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన.. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడం కోసమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన.. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడం కోసమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందుకే ఇప్పుడు ఆగమేఘాలపైన కుల గణన చేయిస్తున్నారని, అలా కాకుండా ఈ ఏడాది కాలం ఎందుకు ఆగారని, ఇప్పటికిప్పుడు సర్వే చేయించడానికి తొందర ఏమొచ్చిందని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్.. పచ్చి అబద్దాలు మాట్లాడారని కూడా కేటీఆర్ విమర్శించారు. ఇక్కడి వాళ్లకే కాంగ్రెస్ మొండి చేయి చూపిందని, ఇక మహారాష్ట్రలో ఏం చేస్తుందని ఎద్దేవా చేశారు. ఏడాది క్రితం బీసీ డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని, వాటిని ఎంత వరకు అమలు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. హన్మకొండలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ప్రశ్నల వర్షం కురిపించారు. చేతి గుర్తుకు ఓటేసినందుకు చేతివృత్తుల వారి గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసం, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం కొత్త పథకాలు దేవుడెరుగు ఉన్న పథకాలే ఊడేలా ఉన్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రభుత్వం మారింది.. అన్నీ ఆగిపోయాయి..

‘‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రాగానే బీఆర్ఎస్ అమలు చేసిన రైతు బంధు, దళితబంధు పథకాలు ఆగిపోయాయి. కుల గణనలో 175 ప్రశ్నలు అడుతున్నారు. బ్యాంకుల్లో డబ్బెంత ఉంది? ఇంట్లో ఏసీ ఉందా? ఫ్రిజ్ ఉందా? అని అడుతున్నారు. దీనిపై కులగణన చేయడానికి వెళ్లిన అధికారులను ప్రజలను నిలదీస్తునస్నారు. బీసీల ఓట్లు పొందడం కోసం అధికారులను బలిపశువులను చేస్తున్న ప్రభుత్వం ఇదే. ఇటువంటి ప్రభుత్వం నేనెప్పుడూ చూడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అదే విధంగా బీసీలకు ఇచ్చిన హామీల్లో 42 శాతం హామీలు నెరవేర్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి’’ అని డిమాండ్ చేశారు.

ఒక్క ఓబీసీ అయినా మంత్రి అయ్యారా..

‘‘కేంద్రంలో దశాబ్దాలుగా రాజ్యమేలిన పార్టీ కాంగ్రెస్. అన్నాళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్కసారైనా ఒక్క మంత్రిత్వ శాఖనైనా ఓబీసీలకు అందించిందా? కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వశాఖ ఉండాలని గతంలో కేసీఆర్ కోరారు. కానీ కాంగ్రెస్ ఆ పని చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ప్రజలు అనుమానిస్తున్నారు. ఇప్పుడు తెంగాణలో కుల గణన కూడా తెలంగాణ ప్రజలపై ప్రేమతో కాదు.. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడం కోసమే. మాటకొస్తే కుల గణన అంటున్నారు కానీ.. బీసీ రిజర్వేషన్ల ఊసు ఎందుకని ఎత్తడం లేదు. తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్లపై అధ్యయానికి బీఆర్ఎస్ ప్రత్యేక బృందాన్ని పంపింది. బీసీ యువతకు వడ్డీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని కాంగ్రెస్ హామీలిచ్చింది. మరి ఇచ్చారా? రూ.10 లక్షలు తర్వాత రూ.10 రూపాయలు కూడా ఇవ్వలేదు’’ అని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రకు వెళ్లి రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు కూడా ఘాటుగా విమర్శించారు.

హరీష్ ఏమన్నారంటే..

‘‘అధికారంలోకి వచ్చిన వారంలోనే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా? ఇచ్చిన ఆరు గ్యారెంట్లను కాంగ్రెస్ పూర్తిగా అమలు చేయలేదు. రుణమాఫీ కేవలం 20 లక్షల మంది రైతులకే జరిగింది. మిగిలిన 22 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి. రుణమాఫీ ఆలస్యంగా చేయడం వల్ల ఈ సమయంలో రైతులు వడ్డీలు కట్టాల్సి వస్తోంది. ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు వల్లిస్తున్నారు. రైతు భరోసా లేదు. రైతు కూలీలకు రూ.12వేల ఇవ్వలేదు. వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రచారం చేస్తున్నారు.. రైతుల్లో ఒక్కరికైనా బొనస్ వచ్చిందా? 11 నెలల్లో ఒక్క ఇల్లు కట్టలేదు. కానీ కూల్చడంలో మాత్రం ముందుటున్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. ఇచ్చారా? మీరు ఇచ్చామని చెప్పుకుంటున్న 50వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మహారాష్ట్రలో చెప్పండి తెలంగాణలో మాట తప్పామని’’ అని హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

Read More
Next Story