
‘కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది’
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కమలం ఎవరూ ఊహంచని విధంగా వికసించనుంది.
కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ వీడింది. హోరాహోరీగా సాగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అంజిరెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు. కిషన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ రాష్ట్రంలో మంచి విజయాలు సాధిస్తుందని ఆయన అన్నారు. అంజిరెడ్డి విజయం సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందన్నారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదనడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే నిదర్శమన్నారు బండి సంజయ్.
బీజేపీని ఎవరూ ఆపలేరు
‘‘బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధాని మోదీ అందిస్తున్న నిజాయితీ పాలనను ప్రజలంతా గుర్తించారు. మోదీ పాలన ప్రభావంతోనే విజయాలు సాధిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రపంచంలో భారత్ విజయం, దేశంలో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న విషయం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందన్నారు. డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించాయి. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడించాలని కాంగ్రెస్ కుట్ర చేసింది’’ అని ఆరోపించారు బండి సంజయ్.
ప్రజల చూపు బీజేపీ వైపు
‘‘తెలంగాణలో కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కమలం ఎవరూ ఊహంచని విధంగా వికసించనుంది. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. తెలంగాణలో డబుల ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ప్రజల భావన కూడా ఇదే. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తమ నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు’’ అని బండి సంజయ్ అన్నారు.