‘సింగరేణి కార్మికులకు రేవంత్ మోసం చేశారు’
x

‘సింగరేణి కార్మికులకు రేవంత్ మోసం చేశారు’

తాను మాటల సీఎం అని రేవంత్ నిరూపించుకున్నారా..!


బోనస్ పేరుతో సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి అండ్ కో భారీ మోసం చేసిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఒక్కో కార్మికుడి కుటుంబానికి దసరా బోనస్‌గా రూ.1,95,610 రూపాయలు చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కాగా దసరా బోసన్ పేరుతో రేవంత్ ప్రభుత్వం.. సింగరేణి కార్మికులకు మోసం చేస్తోందని, వచ్చిన మొత్తం లాభాల్లో వారికి వాటా అందించడం లేదని ఆరోపించారు. ఈ చర్యతో తమ మాటలు కోటలు దాటితే చేతలు గడప కూడా దాటవని ప్రభుత్వం నిరూపించుకుందని, సీఎం కూడా తాను మాటల ముఖ్యమంత్రని తేటతెల్లం చేశారంటూ చురకలంటించారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి, తీవ్ర నిరాశకు గురిచేశారని అన్నారు.

‘‘మొత్తం లాభం 6394 కోట్ల నుండి కాకుండా, 2360 కోట్ల నుండి బోనస్ చెల్లించడం దారుణం. పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి సింగరేణి కార్మికులను మోసం చేశారు. ఇంకా గతేడాది కూడా ఇదేవిధంగా మోసం చేసి, బోనస్ లో 50% వాటా కోత విధించారు. మొత్తంగా సంస్థ గడించిన లాభాల ఆధారంగా ప్రతి ఏడాది కార్మికులకు ఇచ్చే బోనస్ ను కూడా బోగస్ చేసారు. లాభాల వాటలో 50% కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతో శ్రమించి సంస్థకు మంచి ప్రాఫిట్ చూపించినందుకు డబుల్ వాటా వస్తుందన్న కార్మికుల ఆశలను అడియాశలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం’’ అని దుయ్యబట్టారు.

‘‘గతంలో కేసీఆర్‌ సర్కారు ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చారు. కాంగ్రెస్‌ మాత్రం వచ్చిన లాభాన్ని మూడో వంతు పక్కన పెట్టి మిగిలిన ఒక వంతులో వాటా ఇవ్వడం దుర్మార్గం. గతేడాది సింగరేణి భవిష్యత్‌ ప్రణాళిక కోసమని పక్కన రూ.2,283 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు 4034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారు! కార్మికులకు హక్కుగా రావాల్సిన వాటా ఎవరి జేబులకు మళ్లిస్తున్నట్లు? కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపోవడం దారుణం. కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతుంది. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించారు కేసీఆర్’’ అని పేర్కొన్నారు.

‘‘కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ వచ్చారు. సమైక్య రాష్ట్రంలో 1998-99 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 16 శాతమే. స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ఎంతో ఉదారతతో వ్యవహరించారు. రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరం (2014-15)లోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 21 శాతం వాటాను ప్రకటించారు. 2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం ఇచ్చారు’’ అని గుర్తు చేశారు.

‘‘లాభాల వాటాను 16 శాతం ఉన్నదానిని 32 శాతం వరకు పెంచిన ఘనత తెలంగాణ కేసీఆర్‌ కే దక్కుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందరికీ వెలుగు అందించే కార్మికుల జీవితాల్లో చీకటి నింపే ప్రయత్నం చేస్తుంది. సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లించినట్లుగానే లాభాల్లో వాటా చెల్లించాలని, నికర లాభం లో 34% బోనస్ గా ప్రకటించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తుంది’’ అని తేల్చి చెప్పారు.

Read More
Next Story