స్పీడ్ పెంచిన బీజేపీ, బీఆర్ఎస్.. ఎటూ తేల్చని కాంగ్రెస్
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ 14 స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఎటూ తేల్చడం లేదు.
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ 14 స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ మాత్రం 14 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఓవైపు నామినేషన్ల దరఖాస్తుకు ఇంకా మూడు రోజులే గడువు ఉంది. కానీ, మిగిలిన మూడు స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు.
ఏప్రిల్ 25 తో నామినేషన్ల గడువు ముగుస్తోంది. మిషన్ 14 అంటోన్న కాంగ్రెస్ మూడు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన 14 స్థానాలు ఒకెత్తయితే, అభ్యర్థులను ప్రకటించని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకం.
అయితే, ఈ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుండటంతో కాంగ్రెస్ పెట్టుకున్న తెలంగాణ లోక్ సభ సీట్ల టార్గెట్ రీచ్ అవుతుందా అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఇంకోవైపు హైదరాబాద్‌లో కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ఎంఐఎం కి మద్దతు పలకడం ఆ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం లేకపోలేదు.
ఏదేమైనా హైదరాబాద్‌లో బీజేపీ, మజ్లీస్ పార్టీల నుంచి కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు. ఈ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలోనూ, మీడియాలోనూ తమ ప్రచార హోరును పతాక స్థాయిలో చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తోంది.
ఇక కరీంనగర్ విషయానికొస్తే.. బీజేపీకి చెందిన బండి సంజయ్, బీఆర్‌ఎస్ కి చెందిన బీ. వినోద్‌కుమార్ వంటి ప్రత్యర్థి పార్టీల ముఖ్య నేతలు ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారంలో మునిగిపోయారు. టగ్ ఆఫ్ వార్ ఉండే ఇలాంటి టఫ్ సెగ్మెంటులోనూ.. అభ్యర్థిని ప్రకటించడంలో కాంగ్రెస్ చేస్తోన్న జాప్యం క్యాడర్ లో నిరుత్సాహం కలిగిస్తోంది.
మరో ప్రతిష్టాత్మక సెగ్మెంట్, ఆశావహుల పోటీ బలంగా ఉన్న ఖమ్మం స్థానంలోనూ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ నిర్ణయం కొలిక్కి రాలేదు. ముందు రెడ్డి సామజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని భావించిన అధిష్టానం, ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక్కడ పార్టీకి చెందిన ముఖ్య నేతలు తమ కుటుంబంలోని వారికే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడంతో.. ఎటువైపు తలొగ్గాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు మదనపడుతున్నట్టు సమాచారం.
ఇక అభ్యర్థుల ఎంపికలో ఎందుకు జాప్యం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మీడియా ప్రశ్నించగా.. "ఈ మూడు స్థానాల్లో అభ్యర్థులు అధికంగా ఉండటం వల్లే ఆలస్యం అవుతోంది" అని చెప్పారు.