KTR | ‘కాంగ్రెస్ వల్ల తెలంగాణకు ఎటుచూసినా నష్టమే’
x

KTR | ‘కాంగ్రెస్ వల్ల తెలంగాణకు ఎటుచూసినా నష్టమే’

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.


తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అన్ని విధాలా రాష్ట్రం నష్టపోతూనే ఉందని అన్నారు. కృష్ణా నదీ జలాల తరలింపు విషయం నుంచి విద్యార్థుల వరకూ అంతా నష్టమే తప్ప మంచి ఏమీ జరగలేదన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా కీలక పోస్ట్‌లు పెట్టారు. గద్ద వచ్చి కోడిపిల్లలను తన్నుకెళ్లినట్లు ఏపీ.. తెలంగాణ కృష్ణా జలాలను తీసుకెళ్తుంటే కాంగ్రెస్ చేతులు కట్టుకుని చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గురుకులాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, విద్యార్థులు దీనావస్థలో ఉన్నారని అన్నారు. పట్టెడన్నం దొరక్క ఇప్పందులు పడుతూ, ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం దారుణమని అన్నారు.

‘‘కాంగ్రెస్ చోద్యం.. ఏపీ ఇష్టారాజ్యం-యథేచ్చగా కృష్ణా జలాల తరలింపు‌‌. కృష్ణా జలాల నుండి ఏపీ ఇప్పటికే 646టీఎంసీలు వినియోగం. సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడునెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో జలాల తరలింపు. అయినప్పటికీ నిలువరించని కాంగ్రెస్ సర్కార్. నది జలాలను ఆంధ్రప్రదేశ్ తన్నుకు పోతున్నా చలనం లేని బోర్డు-నోరెత్తని రేవంత్ సర్కారు. కృష్ణా,గోదావరి నదుల్లో బొట్టును బొట్టును కాపాడుతూ బీడు భూములను కేసీఆర్ గారు సస్యశ్యామలం చేస్తే-ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో-ఒక్కొక్కొటిగా అన్నింటిని గంగలో కలుపుతుంది కాంగ్రెస్. వచ్చేది వేసవి.. తాగునీళ్లకు, సాగు నీళ్లకు కష్టం అని తెలిసి కూడా గాలిమోటర్లో ఢిల్లీ ట్రిప్పులు కొడ్తున్న ముఖ్యమంత్రికి అన్నదాతల గోస ఏం తెలుసు. కేఆర్ఎంబి పరిధిలోని త్రీ మెన్ కమిటీ దిక్కులేదు-సాగర్,శ్రీశైలం లో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా నీమ్మకు నీరెత్తినట్టు ఉంది కాంగ్రెస్’’ అని పోస్ట్ పెట్టారు.

‘‘పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు.. ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయి. నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు. నేడు సరైన దిశానిర్దేశం లేక దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు.. నేడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారు. నాడు కడుపునిండా అన్నం తిని అనుకున్న లక్ష్యాలను సాధిస్తే...నేడు అన్నమో రామచంద్ర అనే రోజులొచ్చాయి. నాడు 41 వేల సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్ష 68 వేల దరఖాస్తులు వస్తే.. నేడు 51 వేల సీట్లకు గాను 80 వేల దరఖాస్తులే వచ్చాయి. ఏడాది పాలనలో 50 కి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా అంత్యక్రియలకు, పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగిస్తోంది. ఈ సర్కారు నిర్లక్ష్యం తెలంగాణ భవిష్యత్తు అయిన భావితరాలకు శాపం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

Read More
Next Story