‘ఎంత లేపినా కాంగ్రెస్ మొద్దునిద్ర వీడకపోతే ఎలా..!’
x

‘ఎంత లేపినా కాంగ్రెస్ మొద్దునిద్ర వీడకపోతే ఎలా..!’


బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో రేవంత్ సర్కార్.. మొద్దునిద్ర నుంచి లేవడం లేదని, బీఆర్ఎస్ ఎన్నిసార్లు ముళ్లుకర్రతో పొడిచినా లాభం ఉండటం లేదని చురకలంటించారు. పాత తేదీతో కొత్త లేఖ రాస్తే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? అని నిలదీశారు. ‘‘పాత డేట్ (10-10-2025) తో నేడు లేఖ విడుదల చేయడం తప్ప, ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును ఆపే ఉద్దేశ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? లేదా? గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్ లో ఉందని, ప్రాసెస్ చేస్తున్నం అని స్పష్టం చేస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23, 2025 తేదీ నాడు ముఖ్యమంత్రి రేవంతు రెడ్డికి ఉత్తరం రాసిండు’’ అని విమర్శించారు.

‘‘ఇదే విషయాన్ని నేను 11-10-2025న తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి నిలదీశా. ఇప్పటి వరకు ఎలాంటి చర్యా లేదు. అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ ఇప్పటికీ లేఖ రాయలేదు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అవుతుంది. 06-10-2025న నాడు ఏపీ DPR టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయినప్పటికీ దాన్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కాని ఉత్తరం రాయలేదు. ఇదే విషయంలో తెలంగాణ ఇరిగేషన్ సెక్రెటరీ.. కేంద్ర జలశక్తి సెక్రటరీకి ఉత్తరం ఎందుకు రాయడం లేదు? పాత డేట్ వేసి, ఈఎన్సీతో CWC కి ఉత్తరం రాస్తే ఏం లాభం?’’ అని అని అడిగారు.

‘‘ఒకవైపు ఏపీ అక్రమ ప్రాజెక్టు కట్టేందుకు వేగంగా ముందుకు కదులుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలను బ్యాక్ డేటెడ్ లెటర్లతో మభ్యపెడుతోంది. గోదావరి నదీ జలాలను వరద జలాల పేరిట తరలించడానికి ఏపీ సర్కార్ స్టార్ట్ చేసిన అక్రమ ప్రాజెక్టు బనకచర్ల. దాని విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోవడం లేదు.. నటిస్తుంది అంతే. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు మొదలు.. డీపీఆర్ కు టెండర్లు ఆహ్వానించే వరకు ప్రతి సారి బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, నిద్ర లేపుతూ వచ్చింది. బనకచర్ల ద్వారా తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాసే కుట్రలకు పాల్పడుతున్నదని ఎన్నిసార్లు ముల్లుకర్రతో పొడిచినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు’’ అని ఎద్దేవా చేశారు.

‘‘తెలంగాణ భవన్ వేదికగా 11-10-2025న ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే, మూడు రోజుల తర్వాత నెమ్మదిగా నిద్రలేచి పాత డేట్‌తో లేఖ విడుదల చేయడం సిగ్గుచేటు. బనకచర్లను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నిలదీసిన ప్రతి సారి.. లేఖలు రాయడం, 'మమా' అనిపించి చేతులు దులుపుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటయిపోయింది. చోద్యం చూడటం తప్ప బనకచర్లను ఆపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కృషి ఏమీ లేదు. బనకచర్ల ప్రాజెక్టు నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వారి డిమాండ్లు, అభ్యంతరాలను స్పష్టంగా కేంద్రానికి తెలిపితే, తెలంగాణ మాత్రం ఇన్ని రోజులుగా మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటో రేవంత్ రెడ్డికే తెలియాలి’’ అని అన్నారు.

‘‘కర్ణాటక కాంగ్రెస్, ఆంధ్రా టీడీపీ, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంటే రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాడు. 22 నెలల్లో 55 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏనాడూ తెలంగాణ నీటి ప్రయోజనాలు గుర్తు రాకపోవడం మన దౌర్భాగ్యం. రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కుళ్ళు రాజకీయాలు మానేసి తెలంగాణ ప్రయోజనాల కొరకు అఖిల పక్షాన్ని డిల్లీకి తీసుకువెళ్ళు. తెలంగాణ నీటి హక్కులు కాపాడటం కోసం న్యాయ పోరాటానికి సిద్ధపడు’’ అని వ్యాఖ్యానించారు.

Read More
Next Story