
రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు పేటెంట్ హక్కు
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు
బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ కుటుంబం పై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కెసీఆర్ కుటుంబం దోచుకుని దాచుకుందని ఆయన అన్నారు. ఆదివారం జనగామలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట పేటెంట్ హక్కు కమ్యూనిస్ట్ లకు దక్కితే బిసీ రిజర్వేషన్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పేటెంట్ హక్కు ఎఐసీసీ నేత సోనియాగాంధీకి దక్కితే , దండోరా ఉద్యమానికి పేటెంట్ హక్కు మందకృష్ణకు దక్కిందని ఆయన అన్నారు.
అవినీతి ఆరోపణల్లో కెసీఆర్ కుటుంబం మునిగిపోయిందని , ఆ పార్టీ మునిగిపోయే నావ అని ఆయన అన్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో కెటిఆర్, లిక్కర్ కేసులో ఆయన చెల్లి కవిత చిక్కుక్కున్న విషయాన్ని కడియం గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చూసి బిఆర్ఎస్, బిజెపిలు ఓర్వలేకపోతున్నాయని కడియం వ్యాఖ్యానించారు. బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లాయన్నారు.