‘కాంగ్రెస్‌కు ఆ హక్కే లేదు’.. ప్రజా విజయోత్సవాలపై కేటీఆర్
x

‘కాంగ్రెస్‌కు ఆ హక్కే లేదు’.. ప్రజా విజయోత్సవాలపై కేటీఆర్

నవంబర్ 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.


నవంబర్ 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఏం చేశారని విజయోత్సవాలు నిర్వహిస్తారని నిలదీశారు. ప్రజలను కష్టాల్లోకి నెట్టడం తమ్మ ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది విజయోత్సవాలు కాదని, కుంభకోణాల కుంభమేళా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ప్రజా విజయోత్సవాలపై తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా వేదిగా ఘాటైనా పోస్ట్ ఒకటి పెట్టారు. అసలు విజయోత్సవాలు అన్న పదాన్ని వాడే హక్కు కూడా కాంగ్రెస్‌కు లేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది మొత్తంలో కాంగ్రెస్ కేవలం కోలుకోలేని విధ్వంసాన్నే సృష్టించిందని, ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణ బతుకు చీలికలు, పేలికలే అయిందంటూ సెటైర్లు వేశారు. భారతదేశ చరిత్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏడాదిలోనే ఇంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న తొలి ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం మంచి చేశారని సీఎం, డిప్యూటీ సీఎంలు ఈ విజయోత్సవాలకు పిలుపునిచ్చారని ప్రశ్నించారు.

వైఫల్యాలకు కేరాఫ్‌గా కాంగ్రెస్ సర్కార్

‘‘కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే..!! కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు.. “కుంభకోణాల కుంభమేళా”. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజావంచన వారోత్సవాలు. ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట..! కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట..!! బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. “కరప్షన్ కార్నివాల్” ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు. సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్ పాలన. మరి, ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారు’’ అని మండిపడ్డారు.

‘‘ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలుచేయకుండా జనం పైసలతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా ? రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దుఖంలో ఉంటే మీరు వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా? హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ చేసుకుంటారా? ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా? వృద్ధులు పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్ లు చేసుకుంటారా ? బీఆర్ఎస్ భర్తీచేసిన ఉద్యోగాల ప్రక్రియను మీ ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా ? పావుశాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండా వందశాతం చేశామని చెప్పుకోవడం దగా కాదా ? 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్ పథకాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టి మెజారిటీ అర్హులను దూరం చేయడం మోసం కాదా ? 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న తొలి ప్రభుత్వం, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదే. ఈ ముఖ్యమంత్రికి పాలనపై పట్టు కాదు.. ఈ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమలేదు. పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కారుకు అసలు మనసే లేదు. విజయోత్సవాలు అంటే ఏంటో కూడా తెలియని ఈ అసమర్థ పాలకులకు ఆ పదాన్ని వాడే హక్కే లేదు’’ అని వ్యాఖ్యానించారు ఈ మాజీ మంత్రి.

ఘనంగా విజయోత్సవాలు: భట్టి విక్రమార్క

‘‘అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపు రూ.18వేల కోట్ల వ్యవసాయ రుణమాఫీ చేశాం. దాంతో పాటు మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించాం. నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాం. చివరి రోజు డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శన తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం’’ అని ప్రకటించారు.

‘‘ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తాం. అదే విధంగా పారామెడికల్, 16 నర్సింగ్ కళాశాలలను నవంబర్ 28న ప్రారంభిస్తాం. వీటితో పాటుగా ఈ ఉత్సవాల్లో భాగంగా పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నాం. గ్రూప్-4కు ఎంపికయిన వారికి నియామక పత్రాలు అందిస్తాం. డిసెంబర్ 9న హైదరాబాద్ వేదికగా భారీ ఎత్తున ప్రజా వియోత్సవాల ముగింపు వేడుకలు చేస్తాం’’ అని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Read More
Next Story