
‘రిజర్వేషన్లకు ఇబ్బందులు లేవు’
ఏది ఏమైనా రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఏది ఏమైనా రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుల గణన సర్వే నిర్వహించామని, దాని ఆధారంగానే రిజర్వేషన్లను పెంచే నిర్ణయం తీసుకున్నామని పొన్నం వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, బీసీలకు న్యాయం చేసే వరకు తాము ప్రయత్నాలు ఆపమని అన్నారు. రిజర్వేషన్లు పెంచి తీరుతామని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టసభల్లో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. మూడ్ ఆఫ్ హౌజ్ తీసుకున్న తర్వాత బిల్లుకు ఆమోదం లభించిందని, ఆ తర్వాత దానిని గవర్నర్‌కు పంపామని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆమోదం కోసం గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపారని చెప్పారు.
‘‘తమిళనాడును ఉదహరిస్తూ గవర్నర్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను కూడా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. దాని ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం జీఓ నెం.9 ద్వారా 42శాతం రాజర్వేషన్లను ఖరారు చేసింది. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరూ వ్యతిరేకించలేదు. బీసీలకు 42శాతం రిజర్వేషణ్లు ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్దంగా వచ్చిన రిజర్వేషన్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు’’ అని పొన్నం ప్రభాకర్ వివరించారు.
‘‘ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బలహీన వర్గాలకు ఉజ్వల భవిష్యత్తు అందించడం కోసం. వారి నోటి కాడ ముద్ద లాక్కోవద్దు. ఈ రిజర్వేషన్లను సమాజాం మొత్తం కలిసి కాపాడుకోవాలి’’ అని కోరారు.